విూ కేసులు చాలు.. ఇక ఆపండి

– బెంగళూరు దంపతులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : మనస్పర్థలతో విడిపోయిన భార్యభర్తలు ఒకరిపై ఒకరు పెట్టుకుంటున్న కేసులు చూసి సుప్రీంకోర్టు షాక్‌ అయ్యింది. అవును మరి.. ఒకటి కాదు రెండు కాదు ఒకరిపై ఒకరు ఏకంగా 67 కేసులు పెట్టుకున్నారు. దీంతో ‘ఇక చాలు బాబోయ్‌’ అని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇకపై వారు ఎలాంటి కేసులు పెట్టకుండా ఆంక్షలు విధించింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు 2002లో అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహమైంది. పెళ్లి తర్వాత వీరిద్దరూ అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 2009లో వీరికి బాబు పుట్టాడు. అయితే ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో సదరు భార్య అమెరికా నుంచి వచ్చి బెంగళూరులో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఇక అప్పటి నుంచి వీరు విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఒకరిపై ఒకరు కేసుల విూద కేసులు పెట్టుకుంటున్నారు. సదరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తన భార్యపై 58 కేసులు పెట్టగా.. భార్య కూడా తన భర్తపై తొమ్మిది కేసులు పెట్టింది. తాజాగా వీరి కేసులు సుప్రీంకోర్టుకు చేరాయి. వీటిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. దంపతులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పెండింగ్‌లో ఉన్న కేసులు పూర్తయ్యేదాకా భార్యాభర్తలు గానీ.. వారి కుటుంబసభ్యులు గానీ ఎలాంటి కొత్త కేసులు పెట్టకూడదని కోర్టు
ఆదేశించింది. అంతేగాక.. ఆరు నెలల్లోపు పెండింగ్‌ కేసులను పరిష్కరించాలని బెంగళూరు  న్యాయస్థానాలకు ఆదేశాలు జారీ చేసింది. విడాకులు మంజూరు చేయడమా..? ఒక వేళ విడాకులు ఇస్తే కుమారుడి బాధ్యతలు ఎవరు తీసుకోవాలి..? తదితర అంశాలపై కోర్టులు త్వరితగతిన విచారణ చేపట్టాలని సూచించింది.