వైట్‌హౌజ్‌లో దీపావళి వేడుకలు
వాషింగ్టన్,నవంబర్14(జనంసాక్షి): వాణిజ్య పరమైన సంబంధాలను తమకు లాభదాయకంగా మార్చుకోవడంలో ఇండియా అత్యుత్తమ పనితీరు కనబరుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్ హౌస్ లో భారత అమెరికన్లతో కలసి దీపావళి వేడుకలు జరుపుకున్న ఆయన,
ప్రధాని నరేంద్ర మోడీతో తన స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. ఇండియా, అమెరికాల మధ్య బలమైన సంబంధాలున్నాయి. మోడీ నాకు స్నేహితుడు కావడం ఎంతో సంతోషాన్ని గలిగిస్తోంది. ఇండియాతో మరింత ధృడమైన సంబంధాల కోసం కృషి చేస్తున్నాం. అయితే, వారు బేరం చేయడంలో సిద్ధహస్తులు. ఇంకా చెప్పాలంటే, ట్రేడ్ డీల్స్ ను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బెస్ట్ అని అన్నారు. ఆపై వైట్ హౌస్ లోని రోస్ వెల్ట్ రూమ్ లో దీపాలను వెలిగించిన ట్రంప్, వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టాప్ ఇండియన్ అమెరికన్స్ పాల్గొన్నారు.ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు దీపావళిని వారం రోజుల కిందటే జరుపుకున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఓ వారం ఆలస్యంగా ఇప్పుడు వైట్‌హౌజ్‌లో దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు. తన ట్విటర్ వేదికగా అసలు ఈ పండుగ జరుపుకునే హిందువులకు తప్ప మిగతా అందరికీ ట్రంప్ పండుగ శుభాకాంక్షలు చెప్పడం విశేషం. అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా బుద్ధులు, సిక్కులు, జైనులు జరుపుకునే దీపాల పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని ట్రంప్ అన్నట్లు న్యూస్ ఏజెన్సీలు రాశాయి. అయితే అందులో హిందువులను మాత్రం మిస్ చేశారు. ట్రంప్ కూడా దాన్ని అలాగే ట్వీట్ చేశారు. అయితే కొద్ది సేపటి వరకు ఆ ట్వీట్ అలాగే ఉంది. అందులో ట్రంప్ ఎలాంటి మార్పులు చేయలేదు. సుమారు 20 నిమిషాల తర్వాత ఎవరో గుర్తు చేసినట్లున్నారు. దీంతో అప్పుడాయన హిందువుల పండుగ అంటూ మరో ట్వీట్ చేశారు.