వైద్యారోగ్య శాఖలో ఫేక్‌ నియామకాలు

వాటిని నమ్మొద్దన్న కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌

అమరావతి,జూలై27(జనంసాక్షి ):ఉద్యోగాల నియామకానికి ఎటువంటి నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పేరుతో ఉద్యోగాలకు రిక్రూట్‌మెంటు చేపడుతున్నట్లు సోషల్‌ విూడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనరు, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ డైరెక్టరు జె నివాస్‌ వెల్లడిరచారు. ఇలాంటి ప్రచారాన్ని నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఎంఎల్‌హెచ్‌పి, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మాసిస్ట్‌ పోస్టులకు రాష్ట్రంలో నియామకాలు చేపడుతున్నట్లు ఫేక్‌ లెటర్లను తయారు చేశారని, ఆ లెటర్లను సోషల్‌ విూడియాలో వైరల్‌ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యారోగ్యశాఖలో ఎటువంటి రిక్రూట్‌మెంటు చేపట్టినా పత్రికల్లో నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రజలందరికీ తెలియజేస్తామన్నారు.