వ్యవసాయంపై నేలవిడిచి సాము

క్షేత్రస్థాయి అవగాహనా లోపం

అమలుకాని మోడీ లాభసాటి వ్యవసాయ పథకాలు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): వ్యవసాయం లాభసాటి కానంతవరకు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా వ్యర్థమే అన్న సంగతిని పాలకులు గమనించడం లేదు. వ్యవసాయాన్ని లాభసాటి చేస్తాన్న మోడీ హావిూలు అటకెక్కాయి. దీనిపై యానకు కనీస అవగాహన లేకుండా పోయింది. దీంతో ఐదేళ్ల పూర్తి కావస్తున్న సమయంలో తెలంగాణలో అమలు చేసిన రైతుబంధును ఆశ్రయించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయం విషయంలో పక్కా చర్యలు తీసుకోకుండా నేలవిడిచి సాము చేస్తోంది. రుణమాఫీలను విమర్శిస్తూనే రైతులకు తాయిలం ప్రకటించింది. తెలంగాణలో రైతు బంధు పథకాన్ని గమనించిన ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా పరిమిత స్థాయిలో ఈ పథకాన్ని అమలుచేసి ఓట్లు కొల్లగొట్టాలని పథకం వేసుకున్నారు. ముగిసిపోతున్న ఆర్థిక సంవత్సరం నుంచే పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పడంలోనే కేంద్రం ఉద్దేశ్యం ఏమిటో అర్తం చేసుకోవచ్చు.మరో రెండున్నర నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లోపుగా అయిదెకరాలలోపు ఉన్న రైతుల వివరాలు ఎలా సేకరిస్తారో తెలియదు! కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాల పుణ్యమా అంటూ గ్రామాల్లో వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదు. దీనికితోడు ఉపాధి హావిూ పథకం దారుణంగా తయారయ్యింది. దీనిపేర వేలకోట్లు దుబారా చేస్తున్నారు. ప్రజలను దుర్బలులగా చేస్తున్న పథకం అనడంలో ఎంతమాత్రం సందేహం అక్కర్లేదు. ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. అయినా అధికారంలో ఉంటున్నవారు పట్టించుకోవడం లేదు. దీనివల్ల కూలీల కొరత తీరడమే కాకుండా రైతులకు కూలీలపై చేసే ఖర్చు ఎకరానికి నాలుగైదు వేల రూపాయల వరకు ఆదా అవుతాయి. అయినా ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయరు. ఆ పని చేయకుండా పెట్టుబడి సాయమంటూ రైతులను కూడా మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టే పనిలో పడ్డారు. గ్రామాల్లో వ్యవసాయ కూలీలు దొరక్క పోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టులలో పనిచేస్తున్న వారిలో 90 శాతం వరకు ఇతర రాష్ట్రాల వారే కనిపిస్తున్నారు. మొన్నటికి మొన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన కూలీలంతా బెంగాల్‌ నుంచి వచ్చిన వారే. ఇకపోతే మార్కెట్లో ధరలు మండుతున్నా, బియ్యం ధరలు 50 రూపాయలకు ఎగబాకినా ఇంకా కిలో రూపాయి బియ్యం పథకాన్ని కొనసాగిస్తున్నారు. ఇది దోపిడికీ ఓ మార్గంగా మారింది. అక్రమార్కులకు ఆదాయవనరుగా మారింది. 30 ఏళ్ల క్రితం రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ఎన్‌టీఆర్‌ అమలుచేసినప్పుడు ఆ అవసరం ఆనాడు ఉంది. ఇప్పుడు తెలుగునాట రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నారు. ఇది అవసరామా అన్న ఆలోచన చేయడం లేదు. రెవెన్యూ లోటుతో అల్లాడుతున్న ఏపీలో ఇప్పుడు ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతాయో తెలియదు.సంక్షేమ పథకాల అమలుకు ఏకంగా అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడబోతున్నది. రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న కొన్ని సంక్షేమ పథకాలు హాస్యాస్పదంగా ఉంటున్నాయి. వీటన్నింటిని సవిూక్షించుకుంటే తప్ప రాష్ట్రాలు బాగుపడవు. ఇలాంటి పథకాలపై ఆంక్షలు లేకుంటే రాజకీయా పార్టీలో ఓట్ల కోసం దోచి పెట్టడం ఖాయం.