వ్యాపార కేంద్రాలుగా స్కూళ్లు

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌

వరంగల్‌,జూన్‌9(జనం సాక్షి ): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడానికి పాఠశాలలు ఏర్పడతాయి. కానీ జిల్లాలో మాత్రం ప్రైవేటు పాఠశాలలు కేవలం ధనార్జనే ధ్యేయంగా విద్యాలయాల పేరుతో తల్లిదండ్రుల వద్ద నుంచి భరీగా దోచుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యాలయాల్లోనే విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వస్తువులు అమ్మకాలకు పెడుతూ బజార్‌లో లభించే రేట్ల కన్నా ఎక్కువ పెడుతూ తప్పని సరిగా ఇక్కడే కొనాలని నిబంధనలు విధిస్తూ తల్లిదండ్రుల వద్ద అందింనంత దండుకుంటున్నాయి.ప్రైవేటు పాఠశాలల్లో దుకాణాలు పెట్టవద్దని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఎట్టిపరిస్థితిలోనూ పుస్తకాలు,నోట్‌బుక్కులు, యూనిఫారాలు, బెల్టులు, టైలు అమ్మవద్దని గతంలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అనేక జిల్లాల్లో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు యథేచ్ఛగా విద్యావ్యాపారం సాగిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మరి కొన్ని ప్రైవేటు పాఠశాలలు స్పోర్ట్స్‌ యూనిఫారాల పేరుతో మరింత దోపిడీకి పాల్పడుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం పుస్తకాలు అమ్మే బాధ్యత అప్పజెప్పిన ఏజెన్సీలు నేటి వరకు మార్కెట్‌లోకి పుస్తకాలు తేకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలకు మరింత దోపిడీ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫారాలు, బెల్టులు, టైలు, బూట్లు, సాక్సులు, పుస్తకాలు, నోట్‌బుక్కలను పాఠశాలల్లోనే అమ్ముతున్నారు. తప్పని సరిగా తమ పాఠశాలల్లో చదివే చిన్నారులకు సంబంధించిన అన్ని రకాల వస్తువులను పాఠశాలల్లోనే కొనాలని నిబంధనలు విధిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాలు, నోట్‌బుక్కులను ఇష్టారీతిన రేట్లు పెట్టి అమ్ముతున్నారు. మార్కెట్‌లో దొరికే నోట్‌బుక్కుల కంటే అధిక రేట్లకు అమ్ముతున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు పాఠశాలలు విద్యావ్యాపారానికి కేంద్రంగా మారినట్లు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలుధనార్జనే ధ్యేయంగా అడ్డగోలు దోపిడీకి తెరలేపాయి. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడంతో పాటు నోట్‌బుక్స్‌ ఇతర వస్తువులు తమ వద్దే కొనాలంటూ కండీషన్లు పెడుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. యూనిఫారాలు, బెల్టు, టై, బూట్లు, సాక్సులు, పుస్తకాలు, నోట్‌బుక్స్‌ పాఠశాలల్లోనే అమ్ముతున్నాయి. అన్ని రకాల వస్తువులు తమ వద్దే కొనాలంటూ నిబంధనలు విధిస్తున్నాయి. మార్కెట్‌ ధరలకంటే అధికంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయి. సామాన్య, మధ్యతరగతి వారు ప్రైవేటు పాఠశాలల బాదుడుకు బలైపోతున్నారు.