శబరిమలకు..  మహిళలూ వెళ్లొచ్చు

– సంచలన తీర్పు వెలువరించిన సుప్రింకోర్టు
– మహిళలపై నిషేధాన్ని ఎత్తివేసిన సుప్రీం
– ఆలయాల్లో లింగ వివక్షకు తావులేదు
– మహిళలను తక్కువగా, బలహీనులుగా చూడటానికి వీళ్లేదని వ్యాఖ్య
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి) : శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అన్ని వయసుల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించొచ్చని స్పష్టంచేసింది. పది నుంచి యాభై ఏళ్ల వయసు మహిళలపై ఉన్న నిషేధాన్ని కోర్టు ఎత్తేసింది. శుక్రవారం శబరిమలలోకి మహిళల ప్రవేశంపై కోర్టు తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ఆలయంలోకి మహిళ ప్రవేశాన్ని అడ్డుకుంటున్న ఆలయ నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 25ను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. శబరిమల ఆలయంలోకి ప్రవేశానికి మహిళల వయసుకు సంబంధించి నిబంధనలు విధించడాన్ని అత్యవసరమైన మతపరమైన విధానంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఆలయాల్లో లింగ వివక్షకు తావు లేదని, మహిళలను తక్కువగా బలహీనులుగా చూడడానికి వీల్లేదని తీర్పు సందర్భంగా దీపక్‌ మిశ్ర పేర్కొన్నారు. ఈదేశంలో మహిళలను దేవతల రూపంలో పూజిస్తున్నామని, మరోవైపు లింగవివక్షతతో ఆంక్షలు విధిస్తున్నామని తెలిపారు. పురుషుల కంటే మహిళలు దేనిలోనూ తక్కువ కాదని అన్నారు. మహిళలపై నిషేధం హిందూ మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని పేర్కొన్నారు. మతమనేది ప్రాథమిక జీవన విధానంలో భాగమని అన్నారు. మహిళల జీవ సంబంధ(బయోలాజికల్‌) లక్షణాల ఆధారంగా రాజ్యాంగ మార్పు ఉండబోదని వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు ఈ తీర్పుతో అంగీకరించగా, ఏకైక
మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. సతీసహగమనం లాంటి సామాజిక రుగ్మతలు మినహా మతపరమైన విధానాలను తొలగించే దానిపై నిర్ణయించే తీసుకునే అంశం కోర్టుకు సంబంధించినది కాదని ఆమె పేర్కొన్నారు. దేశంలో లౌకిక వాతావరణాన్ని కల్పించేందుకు బలంగా నాటుకుపోయి ఉన్న మతపరమైన ఆచారాల్లో మార్పు చేయొద్దని అభిప్రాయపడ్డారు. రుతుక్రమం వయసులోని (10 నుంచి 50ఏళ్లు) మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించొద్దని ఎన్నో ఏళ్లుగా నిబంధన ఉన్న సంగతి తెలిసిందే.
తీర్పుపై శబరిమల ప్రధాన పూజారి అసంతృప్తి..
కేరళలోని పవిత్ర శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పుపై ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరు అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని వయసుల మహిళలకు శబరిమలలో ప్రవేశం కల్పిస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సంతృప్తిగా లేదని, అయితే తీర్పును తాము అంగీకరిస్తున్నట్లు చెప్పారు.
తీర్పుపై ట్రావెన్‌కోర్‌ దేవస్వామ్‌ బోర్డు అధ్యక్షుడు ఎ. పద్మకుమార్‌ కూడా స్పందించారు. కోర్టు తీర్పును సమగ్రంగా పరిశీలించిన అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్న ఆచారాలను కొనసాగిస్తేనే మంచిదని ట్రావెన్‌కోర్‌ బోర్డు కోర్టుకు చెప్పినట్లు పద్మకుమార్‌ తెలిపారు. అయితే ఇప్పుడు తమకు మరో అవకాశం లేదని, న్యాయస్థానం తీర్పును అమలు చేస్తామన్నారు. అయ్యప్ప ధర్మ సేన అధ్యక్షుడు రాహుల్‌ ఈశ్వర్‌ మాట్లాడుతూ.. తీర్పుపై రివ్యూ పిటిషన్‌కు వెళ్తామని చెప్పారు.