శబరిమల తీర్పును వ్యతిరేకించిన జస్టిస్‌ ఇందూ మల్హోత్రా

హేతుబద్ధతను పరిగణలోకి తీసుకోరాదని వివరణ
న్యూఢిల్లీ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి):  శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చు అంటూ ఇవాళ అయిదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే అందులో జస్టిస్‌ ఇందూ మల్హోత్రా మాత్రం మిగతా నలుగురు న్యాయమూర్తులతో వ్యతిరేకించారు. మతపరమైన అంశాల్లో హేతుబద్ధతను పరిగణలోకి తీసుకోరాదు అని ఆమె తన తీర్పులో తెలిపారు. మహిళల ప్రవేశం తీర్పుపై సుప్రీం లేవనెత్తిన అంశాలు.. కేవలం శబరిమలలో మాత్రమే కాదు, అనేక ప్రార్థనా ప్రాంతాల్లో ప్రభావం చూపుతుందని జస్టిస్‌ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. తీర్పు సందర్భంగా ఆర్టికల్‌ 14 గురించి జస్టిస్‌ చంద్రచూడ్‌ ఓ కామెంట్‌ చేశారు. రాజ్యాంగపరమైన వ్యక్తిగత హక్కులను తక్కువ చేసే ఎటువంటి ఆచారాలైనా వాటిని కొట్టివేయాలని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. దీన్ని మల్హోత్రా వ్యతిరేకించారు. మత ఆచారంలో ఏది ముఖ్యమైనదో అది ఆ మతమే నిర్ణయించాలని, అది వ్యక్తిగత విశ్వాసానికి చెందిన అంశమని, భారత్‌లో భిన్నమైన విశ్వాసాలు ఉన్నాయని, బహుళ సమాజంలో భిన్న ఆచారాలను పాటించే స్వేచ్ఛ రాజ్యాంగమే కల్పిస్తుందని ఈ సందర్భంగా జస్టిస్‌ మల్హోత్రా తెలిపారు. మతపరమైన అంశాల్లో హేతుబద్దతను పరిగణలోకి తీసుకోరాదు అని తెలిపారు. అయ్యప్ప భక్తులను ప్రత్యేక మతస్థులుగా కూడా భావించవచ్చు అని అన్నారు. శబరిమలకు ట్రావన్‌కోర్‌ దేవస్థానం నుంచి నిధులు వస్తున్నాయని, దాని కోసం సంఘటిత నిధి ఏవిూలేదన్నారు.నెలసరి సమస్యల కారణం చూపుతూ మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించింది. మహిళలను దేవతలుగా పూజించే దేశంలో ఆలయంలోకి ప్రవేశించకుండా వారిపై నిషేధం విధించడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించొచ్చంటూ 4-1 మెజార్టీతో తీర్పు వెలువరించింది.