శ్రీలంక పార్లమెంట్ సస్పెన్షన్ ఎత్తివేత
కొలంబో,నవంబర్1(జనంసాక్షి): శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దేశ పార్లమెంటుపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేశారు. రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేలా చర్యలకు దిగారు. పార్లమెంటు సభ్యులతో సోమవారం సమావేశానికి ఏర్పాటు చేశారు. ప్రధాని పదవి నుంచి రణిల్ విక్రమసింఘేను తొలగిచడంపై దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని సద్దుమణిగేలే చేసేందుకు పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసినట్లు ఈరోజు అధికారులు వెల్లడించారు. నిన్న పార్లమెంటు స్పీకర్ కరు జయసూర్య, అధ్యక్షుడు సిరిసేన చర్చలు జరిపిన అనంతరం వచ్చే వారమే పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నవంబరు 5వ తేదీన పార్లమెంటు సమావేశం కానుంది. వాస్తవానికి పార్లమెంటులో సోమవారం బ్జడెట్ ఆమోదించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ప్రధాని పదవికి బలనిరూపణ జరగనున్నట్లు తెలుస్తోంది. గత శుక్రవారం అధ్యక్షుడు సిరిసేన ప్రధాని పదవి నుంచి విక్రసింఘేను తొలగించి ఆ స్థానంలో మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సెను నియమించిన సంగతి తెలిసిందే. అలాగే సిరిసేన పార్లమెంటును కూడా నవంబరు 16వ తేదీ వరకు సస్పెండ్ చేసి సుప్తచేతనావస్థలో ఉంచారు. బల నిరూపణలో విక్రమసింఘేను ఓడించేందుకు సభ్యుల మద్దతును సవిూకరించడానికి అధ్యక్షుడు పార్లమెంటును పక్షం రోజులకు పైగా సస్పెండ్ చేశారని నిపుణులు అభిప్రాయపడ్డారు. శ్రీలంక పార్లమెంటులో 225మంది సభ్యులు ఉండగా మెజార్టీ సాధించడానికి 113 ఓట్లు దక్కాల్సి ఉంటుంది. కాగా సింఘేకు 106మంది సభ్యుల మద్దతు ఉంది. సాధారణ మెజార్టీకి ఏడుగురు సభ్యుల మద్దతు అవసరం ఉన్నందున ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అయితే రాజపక్సెను కలుపుకున్నా సిరిసేన పార్టీ బలం 95సభ్యులకే పరిమితం అవుతుంది. దీంతో వెంటనే పార్లమెంటును సమావేశపరిస్తే తాను బలం నిరూపించుకుంటానని సింఘే అంటున్నారు.