శ్వేతసౌధంలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభం
వాషింగ్టన్,నవంబర్27(జనంసాక్షి):శ్వేత సౌధంలో క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. గతేడాది కూడా ఇదే సమయంలో క్రిస్మస్ చెట్లతో అలంకరించిన వైట్‌హౌస్ ఫోటోలను అమెరికా ప్రథమ పౌరురాలు, ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ట్విటర్‌లో పంచుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. క్రిస్మస్ సవిూపిస్తున్న వేళ ఈ ఏడాది కూడా ఎరుపు రంగు క్రిస్మస్ చెట్లు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో శ్వేతసౌధాన్ని అలంకరించారు. తాజాగా ఈ వీడియోను మెలానియా ట్విటర్‌లో పంచుకున్నారు. ఈ క్రిస్మస్ సెలవుల సమయంలో వైట్‌హౌస్ ఈ విధంగా కనిపిస్తోందంటూ ఆమె ట్వీట్ చేశారు. ఎరుపు రంగు క్రిస్మస్ చెట్లు ఎంచుకునేందుకు గల కారణాలను వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. అధ్యక్షుడి అధికార ముద్రలో ఉండే ఎరుపు, లేత రంగు చారలకు చిహ్నంగా మేం ఎరుపు రంగు క్రిస్మస్ చెట్లనే ఎంచుకున్నాం. ఈ చారలు పరాక్రమానికి, ధైర్యానికి ప్రతీక అని శ్వేత సౌధం వివరించింది.