షట్‌డౌన్ ముగిశాకే మాట్లాడుతా
– ట్రంప్ ప్రసంగానికి నాన్సీ పెలోసీ మోకాలడ్డు
– ట్విట్టర్ లో స్పందించిన అమెరికా అధ్యక్షుడు
అమెరికాలో రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా అమెరికాలో షట్ డౌన్ ముగిశాకే కాంగ్రెస్ ను ఉద్దేశించి ‘స్టేట్ ఆఫ్ యూనియన్’ ప్రసంగం చేస్తానని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికా కాంగ్రెస్ లో ట్రంప్ ప్రసంగానికి ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ అవకాశం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘షట్‌డౌన్ కొనసాగుతుండగా ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగం చేయమని నాన్సీ పెలోసీ తొలుత కోరారు. నేనూ అంగీకరించాను. కానీ అంతలోనే ఆమె మనసు మార్చుకున్నారు. ప్రసంగాన్ని మరో తేదీకి మార్చుకోవాలని సూచించారు’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికాలో షట్‌డౌన్ ముగిసిన తర్వాతే ప్రసంగిస్తానని స్పష్టం చేశారు. అలాగే తాను మరో వేదిక కోసం ప్రయత్నించడం లేదని చెప్పారు. చరిత్ర, సంప్రదాయం, హౌస్ ఛాంబర్ ప్రాధాన్యతతో ఎవ్వరూ పోటీ పడలేరని అన్నారు. త్వరలో గొప్ప ప్రసంగం చేయడానికి ఎదురు చూస్తున్నానని తెలిపారు. అమెరికా-మెక్సికో సరిహద్దు గోడకు రూ.40,621 కోట్లు(5.7 బిలియన్ డాలర్లు) ఇవ్వాలని ట్రంప్ కోరుతున్నారు. అయితే ఇందుకు డెమొక్రాట్లు ఒప్పుకోకపోవడంతో ట్రంప్ వ్యయ బిల్లులపై సంతకం పెట్టేందుకు నిరాకరించారు. దీంతో అమెరికా పాక్షిక షట్ డౌన్ లోకి జారిపోయింది. ఈ నిర్ణయం వల్ల 8,00,000 మంది వేతనాలు లేకుండా నెల రోజులుగా ఇంటికి పరిమితం అయ్యారు. మెక్సికోతో సరిహద్దులో గోడ నిర్మాణానికి నిధుల విషయంలో ట్రంప్, డెమోక్రాట్ల మధ్యఅభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఇరు పార్టీలు షట్‌డౌన్‌ను ముగించేందుకు చర్చలు జరుపుతున్నాయి.