సంక్షేమంలో తెలంగాణ ముందు

ఆర్థికంగా ఎదుగుతున్న మహిళలు: గుండు

వరంగల్‌,జూన్‌9(జనం సాక్షి ): నాలుగేళ్ల కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో నిలిపిన ఘనత సిఎం కెసిఆర్‌దని మాజీఎంపీ, తెలంగాణ రాష్ట్రసమితి మహిళానేత గుండుసుధారాణి అన్నారు. మహిళలకు, యువతులకు భద్రతగా షీటీమ్‌లను ప్రారంభించిన ఘనత ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని, ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధనలో మమేకం కావాలని అన్నారు. మాది చేతల ప్రభుత్వమని, ఆంధ్రా పాలకుల ఆరోపణలు పటాపంచలు చేస్తూ కరెంటు కోతలను అధిగమించామన్నారు. సంక్షేమ పథకాల అమలుతో ప్రభుత్వం కన్నతల్లి పాత్రను పోషిస్తుందని, దళితుల సంక్షేమమే ఎజెండాగా పని చేస్తానన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రతీఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. ఒంటరి మహిళలకు ప్రభుత్వం తరఫున జీవనభృతి అందించడం గొప్ప విషయమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఒంటరిగా జీవిస్తున్న మ హిళలు పడుతున్న కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం వారికి చేయూత అందించనుందన్నారు. పేదరికంతో పురుషుల కన్న మహిళలు ఎక్కువగా ఇబ్బందులు పడుతుండగా నిస్సహాయులైన ఒంటరి మహిళలను ఆదుకునేందుకు వారికి ప్రతి నెలా రూ.1000 జీవనభృతిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని,అన్నారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో ప్రతీ మహిళా స్వయం ఉపాధిపై దృష్టి సారించి మరింత ఆర్థికంగా ఎదగాలన్నారు. జీవనోపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఎంతో మంది మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారని అన్నారు. గ్రామాల్లోని గ్రామైక్య సంఘా లు పదిమందితో టీంగా ఏర్పాటై ఆసక్తి కలిగిన యూనిట్లు ఏర్పాటు చేసుకుని వ్యాపార రంగంలో రాణిస్తున్నారని అన్నారు. పలు గ్రామాల్లో పేపర్‌ప్లేట్ల తయారీ, టీపొడి, పప్పులు, సర్ఫ్‌, పసుపు, కారంపొడి తయారు చేస్తూ మార్కెటింగ్‌ చేపడుతున్నారని అన్నారు. గ్రామంలో యూనిట్లు నడుపుతున్న సంఘాలకే ప్రభుత్వ వసతిగృహాలకు నిత్యావసర సరుకులు సరఫరా చేసే బాధ్యత అప్పగించారని అన్నారు.