సంపత్‌ను నియామకంపై సర్వత్రా హర్షం

కురుమ సామాజిక వర్గానికి ప్రాధాన్యం

జనగామ,జూన్‌4(జ‌నం సాక్షి):ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవస్థానం చైర్మన్‌గా సేవెల్లి సంపత్‌ను నియమించడంతో పలువురు టిఆర్‌ఎస్‌ నేతలు కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. పార్టీల చేఇన సేవలకు తగిన గుర్తింపు లభించిందని అన్నారు. సాధారణ ఎన్నికల్లో క్రీయాశీలకంగా పనిచేసిన కార్యకర్తగా జిల్లాలో అత్యధికంగా ఉన్న కురుమ సామాజిక వర్గానికి చెందిన సేవెల్లి సంపత్‌కు కొమురవెల్లి చైర్మన్‌ పదవి దక్కడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి. ప్రముఖ కొమురవెల్లి దేవస్థానం చైర్మన్‌ పదవికి తొలిసారి ఈప్రాంతానికి చెందిన కుర్మ కులస్తుడిని ఎంపిక చేయడంపై జనగామ పట్టణ కుర్మ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగులపల్లి శ్రీశైలం, జూకంటి శ్రీశైలం హర్షం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ పాలనలో తమ సామాజిక వర్గానికి పెద్దపీట దక్కడం సంతోషంగా ఉందన్నారు. కాగా, తనపై నమ్మకం ఉంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన కొమురవెల్లి దేవస్థానం చైర్మన్‌ పదవి అప్పగించేందుకు కృషి చేసిన మంత్రి హరీశ్‌రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సహకరించిన మండ లి విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే డాక్టర్‌ టీ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు సేవెల్లి సంపత్‌ కృతజ్ఞతలు తెలిపారు. జనగామ జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు ఉన్న మరో నామినేట్‌ పదవి దక్కిందన్నారు సంపత్‌ టీఆర్‌ఎస్‌లో ఆవిర్భావం నుంచి క్రీయాశీలకంగా పనిచేస్తున్నారు. జనగామకు చెందిన సేవెల్లి సంపత్‌ను మరో 13మంది పాలకవర్గం సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి సాధారణ కార్యకర్తగా పనిచేసి జనగామ పట్టణ టీఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షుడిగా, ఉమ్మడి వరంగల్‌ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, పూర్వ వరంగల్‌ జిల్లా బీసీసెల్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాల మండలంలో ఉన్న కొమురవెల్లి దేవస్థానం జిల్లాల పునర్విభజన తర్వాత సిద్ధిపేట జిల్లాలో విలీనం కావడం కొత్త మండలం గా ఏర్పడిన కొమురవెల్లి దేవస్థానం చైర్మన్‌ పదవికి జనగామ ప్రాంతాని కి చెందిన నాయకుడికి దక్కడం ఇదే ప్రథమం.