సంయమనం పాటించాలి

– ఇరుదేశాలు సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులను నెలకొల్పాలి
– యూఎన్‌ నుంచి సహకారం అందించడానికి సిద్ధం
– ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో ఘటనపై ఐరాస స్పందిచింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ మాట్లాడుతూ.. ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేలా ఇరు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ముందు పాక్‌, భారత్‌లు సంయమనం పాటించాలని, తద్వారా సరిహద్దులో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి కలిసి చర్యలు తీసుకోవాలన్నారు. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేలా, సాధారణ పరిస్థితులు నెలకొనేలా కావాలంటే యూఎన్‌ నుంచి ఎటువంటి సహకారం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని ఆంటోనియో గుటెరస్‌ తెలిపారు. పుల్వామా దాడితో రెండుదేశాల మధ్య సంబంధాలు ఆందోళనకర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. 40మంది జవాన్ల మృతికి పాకిస్థాన్‌ కారణమంటూ భారత్‌ వాదిస్తుండగా.. దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ పాకిస్థాన్‌ చెప్పుకొస్తోంది. ఇప్పటికే దీనిపై ఇరు దేశాలు ఆయా రాయబారుల ముందు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై యూఎన్‌లోని పాకిస్థాన్‌ అధికారులతో
చర్చలు జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు  గుటెరస్‌ అధికార ప్రతినిధి డుజార్రిక్‌ తెలిపారు. ఐరాస మానవ హక్కుల మండలి హై కమిషనర్‌ మిచెల్లీ బకెల్ట్‌ సైతం దాడిని తీవ్రంగా ఖండించారు. దాడులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. పింగ్లాన్‌లో జరిగిన దాడులపైనా ఆవేదన వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపైనా వారు విచారం వ్యక్తం చేశారు. శాంతియుత వాతావరణంలో చర్చలు జరిపి పరిస్థితులను చక్కదిద్దుకోవాలని సూచించారు.