సనాతన ధర్మానికి ప్రాణప్రతిష్ట చేసిన ఆదిశంకరులు
హైదరాబాద్,ఏప్రిల్20(జనంసాక్షి): ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలూ పుట్టుకొచ్చి, ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య.జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 విభవ నామ సంవత్సరం, వైశాఖ శుద్ధ పంచమి నాడు కర్కాటక లగ్నమందు కేరళ రాష్ట్రం, కాలడి లో శివగురు, ఆర్యాంబ దంపతులకు జన్మించారు. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నప్పటికీ, కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి, మన హిందూ గ్రంథాల ప్రకారం, ఆయన జీవన కాలం క్రీ.పూ.509 ? క్రీ.పూ. 477 అని తెలియవస్తోంది.ఆయన తన రెండవ ఏటనే రాయడం, చదవడం మొదలుపెట్టారు. మూడవ ఏటనే గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేసారు. ఏడవసంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేసారు.కారణజన్ములైన శంకరాచార్యులవారు, సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవింద భగవత్పాదా చార్యులవారి చెంత శాస్త్రాధ్యాయనం చేశారు. హిందూ ధర్మపరిరక్షణ బలహీనపడుతుండటాన్ని గమనించిన ఆయన, ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. అందుకోసం తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ, అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చలో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో శతాధిక గ్రంధాలను రచించిన శంకరులవారు, ఉపనిషత్తులు .. బ్రహ్మసూత్రాలు .. భగవద్గీత .. విష్ణు సహస్రనాలకు భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు. శృంగేరి .. బదరి ..
పూరీ .. ద్వారక అనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో పీఠాలను స్థాపించారు. శంకరుల చిన్నతనంలో ఆయన అనన్యసామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి. ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులు ని దర్శించి ఆయనే తన గురువు అని తెలిసికొని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి, శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు.ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి వ్యాసమహర్షి దర్శనానికి కాశీ(వారణాసి) బయలుదేరారు.ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించుటకై పరమశివుడు చండాలుని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు శంకరులు చండాలుని ప్రక్కకి తొలగమని చెప్తారు. అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు, ఈ శరీరాన్నా లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరుకాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ మనీషా పంచకం చదివారు.ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీదేవతల స్తుతులూ, అనేక, ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలూ రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవిందం మొదలైనవి. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు,పద్మపాదుడు, సురేశ్వరుడు, పృధ్వీవరుడు మొదలైన వారు.ధర్మసంస్థాపన చేయడానికై ఆయన దేశం నలువైపులా నాలుగు పీఠాలను స్థాపించారు. తన 32 వఏట ఉత్తరాఖండ్ కాశీలో దేహాన్ని త్యజించారు.