సభ సజావుగా జరిగేందుకు సహకరించండి!

– విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం

– ప్రతిపక్ష ఎంపీలను కోరిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జులై17(జ‌నం సాక్షి) : పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని ప్రధాని మోదీ ప్రతిపక్షాల సభ్యులను కోరారు. బుధవారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలతో కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల్లో అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరింది. విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, విలువైన సమయాన్ని వృధా చేయకుండా చర్చల్లో పాల్గొనాలని కోరింది. కీలకమైన త్రిపుల్‌ తలాక్‌ బిల్లుతో పాటూ పలు ఇతర బిల్లులను ఈ సెషన్స్‌ లోనే ఆమోదింపజేయాలని కేంద్రం భావిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌ లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఈ సమావేశాల్లో సభ ముందుకు తీసుకురావాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. అటు పలు స్థానిక సమస్యలపై ప్రాంతీయ పార్టీలు తమ గళం విప్పేందుకు రెఢీ అయ్యాయి. అఖిల పక్ష సమావేశానికి ప్రధాని మోడీ, ¬ంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌, పార్లమెంట్‌ వ్యవహారశాఖ మంత్రి అనంతకుమార్‌ హాజరయ్యారు. ఈ మేరకు సభకు సజావుగా జరిగేలా ప్రతీ ఒక్కరూ సహకరిస్తారని భావిస్తున్నామని ప్రధాని తెలిపారు. ఈ సమావేశంలో తెదేపా ఎంపీలు కేశినేని నాని, మురళీమోహన్‌, తోట రామారావు, బుట్టా రేణుక, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేకేతో పాటూ లోక్‌ సభ పక్ష నేత జితేందర్‌ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు.