సమాచారం అడిగితే.. 

32వేల పత్రాల ఇచ్చారు!
– అదీ హిందీలో అడిగితే ఇంగ్లీష్‌లో పంపించారు
– ఆర్టీఐ చట్టం ద్వారా గోదుమల సేకరణ వివరాలు కోరిన రైతు
– అధికారులు ఇచ్చిన సమాచార పత్రాలతో కంగుతిన్న అర్జీదారుడు
సిర్సా, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ) : సాధారణంగా సమాచార హక్కు చట్టం ద్వారా ఎవరైనా ఏదైనా విషయం గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ అలాగే ఓ రైతు గోధుమల సేకరణ ఎలా జరుగుతుందనే విషయాన్ని స.హ చట్టం ద్వారా తెలుసుకోవాలనుకున్నాడు. గోధుమల సేకరణ విషయంలో జరుగుతోన్న అవినీతిని బహిర్గతం చేయాలనే ఉద్దేశంతో స.హ చట్టాన్ని ఆశ్రయించాడు. స.హ చట్టం నుంచి అధికారులు పంపిణీ పత్రాలను చూసి రైతు కంగుతినాల్సిపరిస్థితి వచ్చింది. 32వేల పత్రాలను పంపడంతో పాటు అదీ రైతు హిందీలో అడిగితే అధికారులు ఇంగ్లీష్‌లో సమాధానం అందించారు. దీంతో అధికారుల తీరుపై సదరు రైతు తలపట్టుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జూన్‌ 25, 2018న హరియాణాలోని సిర్సాలో అనిల్‌ కిస్వాన్‌ అనే రైతు గోధుమల సేకరణ ఎలా జరుగుతుందనే విషయాన్ని తెలియజేయాల్సిందిగా కొన్ని ప్రశ్నలు స.హ.చట్టం ద్వారా వేస్తూ సమాధానం ఇవ్వాల్సిందిగా డిప్యూటీ కమిషనర్‌(డీసీ)ని కోరాడు. ఆ పిటిషన్‌ను డీసీ హరియాణా స్టేట్‌ కోపరేటివ్‌ సప్లై అండ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎఫ్‌ఈడీ)కి పంపించారు. వాళ్లు కిస్వాన్‌ అడిగిన ప్రశ్నలకు దాదాపు 32,017 పత్రాలతో కూడిన సమాధానాలను ఇచ్చారు. ఆ పత్రాలు మొత్తం 11 రిజిస్టర్డ్‌ పార్శిల్స్‌ ద్వారా కిస్వాన్‌కు చేరాయి. వాటి బరువు సుమారు 160 కిలోలు ఉంది. అంతేకాదు.. ఆ పత్రాలు అన్ని ఆంగ్ల భాషలోనే ఉన్నాయి. కిస్వాన్‌కు హిందీ తప్ప ఆంగ్లం అర్థం కాదు. కనీసం ఇంగ్లీష్‌ను సరిగా చదవడం కూడా రాదు. దీంతో ఆంగ్లంలో వచ్చిన 32వేల సమాధాన పత్రాలు చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ‘నేను గోధుమలు అమ్మేందుకు వెళ్లిన సమయంలో స్థానిక మార్కెట్‌లో గోధుమ సేకరణ విషయంలో అవినీతి జరగడాన్ని గమనించాను. అందుకే గోధుమల సేకరణ ఎలా జరుగుతుందో తెలుసుకొని, అక్కడ జరుగుతున్న అవినీతి కుంభకోణాన్ని బయటపెట్టాలని అనుకున్నాను’ అని రైతు కిస్వాన్‌ చెప్పుకొచ్చాడు. ‘నేను సమాధానం హిందీలో ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాను. కానీ అధికారులు మాత్రం మొత్తం ఇంగ్లీష్‌లో ఇచ్చారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను కనీసం ఇంగ్లీష్‌ చదవలేను కూడా’ అంటూ సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ తన ప్రయత్నాన్ని మాత్రం ఆపబోనని చెప్పుకొచ్చాడు. ఈ కుంభకోణం విలువ కోట్లలో ఉంటుంది. నేను ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాను. దీన్ని అడ్డుకునేందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. దీనిపై విచారణ చేయాల్సిందే’ అంటూ కిస్వాన్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు.