సముద్రంలో కుప్పకూలిన.. ఇండోనేషియా విమానం
– ఇండోనేషియాలోని లియాన్ విమానయాన సంస్థకు చెందిన ‘జేటీ 610’ విమానం సోమవారం ఉదయం సముద్రంలో కుప్పకూలినట్లు ఇండోనేషియా నేషనల్ సెర్చ్, రెస్య్కూ ఏజెన్సీ తెలిపింది
– సహాయక చర్యలు వేగవంతం
– అంతా మృతిచెందినట్లు భావిస్తున్న అధికారులు
జాకార్తా, అక్టోబర్29(జనంసాక్షి) : విమానయానంలో విషాదాల చరిత్ర ఉన్న ఇండోనేషియాలో మరో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోనేషియాలోని లియాన్ విమానయాన సంస్థకు చెందిన ‘జేటీ 610’ విమానం సోమవారం ఉదయం సముద్రంలో కుప్పకూలినట్లు ఇండోనేషియా నేషనల్ సెర్చ్, రెస్య్కూ ఏజెన్సీ తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 189 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం సోమవారం ఉదయం 6.20 ప్రాంతంలో ఇండోనేషియా రాజధాని జకర్తాలోని టాంగేరాంగ్ ఎయిర్ పోర్ట్ నుంచి పంగ్‌కల్ పినాంగ్‌కు బయలుదేరి వెళ్లింది. ఉదయం 7.30 గంటలకు పంగ్‌కల్ పినాంగ్‌కు చేరుకోవాలి. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా విమానం మధ్యలోనే కుప్పకూలింది. విమానం టేకాఫ్ అయిన 13 నిమిషాలకు.. అంటే 6.33 గంటలకు విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో సంబంధాలు తెగిపోయాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. సముద్రంలో చెలరేగిన తుపాను కారణంగా సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది. అదృశ్యమైన విమానం కాసేపటికే జావా సముద్రంలో కుప్పకూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. సముద్ర తీరానికి సవిూపంలో విమాన శకలాలను కూడా గుర్తించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విమానంలో ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది అనేది మేం ఇప్పుడే చెప్పలేమని, కానీ సాధ్యమైనంతవరకు ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేస్తామని అధికారులు తెలిపారు. ప్రయాణికుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించారు. విమాన శకలాల వద్దకు సహాయ బృందాలు చేరుకున్న దృశ్యాలను ఓ నేవీ అధికారి తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
కూలిపోయిన ఇండోనేషియా విమానానికి కెప్టెన్ భారతీయుడే!
జావా సముద్రంలో కూలిపోయిన విమానానికి కెప్టెన్‌గా ఢిల్లీకి చెందిన భవ్యే సునేజా(31) వ్యవహరిస్తున్నారు. ఇతను ఢిల్లీకి చెందిన పైలెట్. ఈ ప్రమాదంలో కెప్టెన్ భవ్వే సునేజాతోపాటు అందరూ ప్రాణాలు కోల్పోయి ఉంటారని లియాన్ ఎయిర్‌లైన్స్ అధినేత మహ్మద్ షియూగీ పేర్కొన్నారు. విమానం
కూలిన తర్వాత ఎమర్జెన్సీ ట్రాన్స్‌మిటర్ నుంచి తమకు ఎలాంటి సంకేతాలు అందలేదని ఆయన పేర్కొన్నారు. అలాగే, విమానం కూలిన పరిసర ప్రాంతాల్లోని 30నుంచి35 విూటర్ల దూరంలో హెడ్‌ఫోన్స్, లైఫ్ జాకెట్స్‌ను రాడార్లు గుర్తించాయని తెలియజేశారు. లయిన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం కెప్టెన్‌గా ఉన్న భవ్యే సునేజా 2011 నుంచి ఆ సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని మయూర్ విహార్‌కు చెందిన సునేజా, బెల్ ఎయిర్ ఇంటర్నేషనల్ నుంచి 2009లో పైలట్ లైసెన్స్ పొందాడు. తర్వాత, ఎమిరైట్స్ ఎయిర్‌లైన్స్‌లో ట్రెయినీ పైలట్‌గా సెప్టెంబరు 2010న జాయిన్ అయ్యారు. అందులో నాలుగు నెలలు శిక్షణ అనంతరం ఇండోనేషియా లియాన్ ఎయిర్‌లైన్స్‌లో 2011 మార్చిలో పైలట్‌గా చేరాడు. భారత్ నుంచి అత్యధిక విమాన సర్వీసులు ఈ సంస్థ నడపడంతో తనకు ఢిల్లీలో పోస్టింగ్ కావాలని గత జులైలో కోరినట్టు లయిన్ ఎయిర్‌లైన్స్ ఉన్నతాధికారులు తెలిపారు. సుజానే గురించి ఆ సంస్థ అధికారులు మాట్లాడుతూ… తన స్వస్థలం ఢిల్లీ కాబట్టి, అక్కడే తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరాడని వెల్లడించారు. సుజానే వ్యక్తిగత ప్రవర్తనపై కూడా ఎలాంటి ఫిర్యాదులు లేవని, గతంలోనూ ఆయన వల్ల ఎలాంటి ప్రమాదాలు జరిగిన దాఖలాలు లేవని వివరించారు. తమ సంస్థలో పనిచేసే భారతీయ పైలట్లలో చాలా మంది ఉత్తర భారతానికి చెందినవారే కాబట్టి, తమకు ఢిల్లీలో పోస్టింగ్ కావాలని కోరుతారని, సుజానే కూడా అలాగే విఙ్ఞప్తి చేశాడన్నారు. ఏడాది తర్వాత తనను ఢిల్లీకి బదిలీచేస్తామని హావిూ ఇచ్చినట్టు వారు పేర్కొన్నారు. అంతేకాదు విమాన ప్రమాదంలో గల్లంతైన పైలట్ సుజానేతోపాటు మిగతా ప్రయాణికులు సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు.