సమున్నత వ్యక్తిత్వం వాజయ్‌పేయి గొప్పదనం

ఆయన చూపిన బాట నేటితరం రాజకీయాలకు ఆదర్శం
అజాత శత్రువే అయినా దేశానికి దిశాదశా చూపిన ధీశాలి
పోఖ్రాణ్‌ అణుపరీక్షలు, కార్గిల్‌ యుద్దం ఆయన ధీరోదాత్తతకు నిదర్శనాలు
నివాళి అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి,స్పీకర్‌
పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో వాజ్‌పేయ్‌ చిత్రపటం ఆవిష్కరణ
న్యూఢిల్లీ,ఫిబ్రవరి12 జ‌నంసాక్షి): ఏదైనా కార్యాన్ని సమర్థంగా ముందుకు తీసుకుని వెళ్లాలన్నా, దాన్ని విజయం చేయాలన్నా కలసిమెలసి ఒకేబాటలో సాగాలన్నదే అటల్‌జీ ఆదర్శమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. ధృడచిత్తానికి దివంగత ప్రధాని అట్‌బిహారీ వాజ్‌పేయ్‌ నిలువెత్తు నిదర్శనమని అన్నారు.
మాజీ ప్రధాని, దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ చిత్రపటాన్ని పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఏర్పాటు చేశారు. ఈ చిత్రపటాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌, మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, దేవెగౌడ, సీనియర్‌ నేతలు అద్వానీ, రాజ్యసభలో విపక్షనేత గులాం నబీ ఆజాద్‌, సోనియాగాందీ, మల్లికార్జున ఖర్గే,కేంద్రమంత్రులు పలు పార్టీల ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరై వాజ్‌పేయీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాధ్‌  కోవింద్‌ మాట్లాడుతూ ఆయన ఉదాత్త లక్షణాలే దేశానికి ఆలంబనగా నిలిచాయని అన్నారు. వివిధ రంగాల్లో ఆయన చూపిన ప్రతిభ అనన్య సామాన్యమని అన్నారు. దేశ అభివృద్ది కోసం తీసుకున్న అనేకానేక నిర్ణయాలు భారత్‌ ఇవాళ తలెత్తుకుని ముందుకు సాగేలా చేశాయని అన్నారు. పోఖ్రాన్‌ అణుపరీక్షలు కావచ్చు, కార్గిల్‌ యుద్దం కావచ్చు ఆయన ధీరోదాత్త నాయకత్వానికి నిదర్శనాలని అన్నారు. ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించడం ద్వారా భారత్‌ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. తన ప్రసంగంలో కోవింద్‌ అటల్‌ కవితలను వినిపిస్తూ ఆయన సేవలను నిరంతరం గుర్తు చేసుకుని ముందుకు సాగడమే నిజమైన నివాళి అన్నారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో ఇతర ప్రముఖుల స్థానంలో వాజ్‌పేయ్‌ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పాన్ని అభినందించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ వాజ్‌పేయీ సేవలను, నాయకత్వ లక్షణాలను గుర్తుచేసుకున్నారు. ఇప్పటి నుంచి అటల్‌జీ మనల్ని ఆశీర్వదిస్తారు. మనకు స్ఫూర్తినిస్తారు. ఆయన తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే ఉన్నారు. అయినప్పటికీ పదవిని ఆశించకుండా ప్రజల సమస్యలను లేవనెత్తేవారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తన సిద్దాంతాలను వదలని గొప్ప వ్యక్తి అటల్‌జీ. ఆయన ప్రసంగంలో తెలియని ఓ శక్తి ఉంటుంది. ఆయనో గొప్ప నేత’ అని మోదీ కొనియాడారు. మనో వైజ్ఞానికి శాస్త్రవేత్తలు ఆయన ఉపన్యాసాలను, వ్యక్తిత్వాన్ని అధ్యయనం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.  మౌనంలో కూడా ఆయన విశాలమైన సందేశాన్ని ఇచ్చేవారని అన్నారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వాజ్‌పేయీ సుదీర్ఘ కాలం అనారోగ్యంతో బాధపడుతూ గతేడాది ఆగస్టు 16న తుదిశ్వాస విడిచారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్లిన మహానుభావుడని శ్లాఘించారు. వాజ్‌పేయ్‌ టవరింగ్‌ పర్సనాలిటీ అని కొనియాడారు. ఆయన జీవితం, ఆయన ప్రేరణ, ఆయన నడవడి నేటి తరానికి సదా స్మరణీయమని అన్నారు. రాజకీయాల్లో ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అన్నారు. ఆయన అజాత శతృవని కొనియాడారు. కనెక్టివిటీ అన్న కీ పాత్రను పోషించారని అన్నారు. దేశాన్ని టెలికమ్‌, రోడ్డు కనెక్టివిటీకి ప్రాధాన్యం ఇచ్చి
అభివృద్దికి బాటలు వేశారని అన్నారు. అయితే నేటి తరలంలో విలువలు మృగ్యం అవుతున్నాయని అన్నారు. రాజకీయ నేతలు విలువలు కోల్పోతున్నారని అన్నారు. రాజకీయాల్లో శతృవులు ఉండరన్నారు. ఆయన చూపిన బాటలో నడవాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పిన మ¬న్నత వ్యక్తిత్వం ఆయనదన్నారు. ఆయనో గొప్ప రోల్‌ మాడలన్నారు. ఆయన ఆశయాలను ఆచరించడమే వాజ్‌పేయ్‌కు నిజమైన నివాళి అన్నారు. అటల్‌జీ ఎప్పికీ గొప్పనేత అని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కొనియాడారు. జీవితంలో ఏదో సాధించాలన్నా అందుకు వాజ్‌పేయ్‌ ఆదర్శం కావాలన్నారు. దేశంకోసం నిరంతరం తాపత్రయపడిన మహానీయుడని అన్నారు. తనకు సంబంధించినంత వరకు ఇదో గొప్ప రోజని కొనియాడారు.  అటల్‌ బిహారీ వాజ్‌ పేయి గొప్ప రాజనీతి గల నేత అని  కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ కొనియాడారు. ఆయన ప్రతిపక్షనేతలను విమర్శించేది కానీ వారిపట్ల మనసులో ఎటువంటి ద్వేశం ఉండకపోయేదని అన్నారు. ఆయన చిత్రపటాన్ని సెంట్రల్‌ హాల్‌ ఆవిష్కరించడం ఆయన మచ్చలేని రాజకీయ జీవితానికి, పరిపాలనా దక్షతను గౌరవించినట్టేనని అన్నారు.