సరస్వతి నిధి పథకాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలి : కలెక్టర్‌

నెల్లూరు, జూలై 19: ప్రతిభ కలిగి, ఆర్థిక స్తోమత లేక కార్పొరేట్‌ కళాశాలలో విద్యను అభ్యసించలేని విద్యార్థులకు ఉచితంగా ఇంటర్మీడియట్‌ చదివేందుకు ఉద్దేశించిన సరస్వతి నిధి పథకాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ కోరారు. సరస్వతి నిధి పథకం మొదటి బ్యాచ్‌లో 45 వేల మంది విద్యార్థుల ఎంపిక నేపథ్యంలో గురువారం స్థానిక గోల్డన్‌ జూబ్లీ హాలులో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ సరస్వతి నిధి పథకం కింద మొదటి బ్యాచ్‌లో 45 మంది ఎంపిక కాగా వారిలో 20 మంది ఎస్సీ విద్యార్థులని, మిగిలిన 20 మంది అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, మిగిలిన ఐదుగురికి ఉచితంగా చదివించేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ముందుకు వచ్చారని అన్నారు. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులంతా క్రమం తప్పకుండా కళాశాలలకు వెళ్లాలని, వారు కోరుకున్న కార్పొరేట్‌ కళాశాలలో విద్య అభ్యసించే అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. విద్యార్థుల తీరుతెన్నులపై సరస్వతి నిధికి చెందిన సభ్యులు హాస్టల్‌ను సందర్శిస్తారని అన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు కోటీ 84లక్షల రూపాయల నిధులు సేకరించామని అన్నారు. ఈ నిధులపై వచ్చే వడ్డీతో విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ చదివించడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. రాయితీపై విద్యార్థులకు సీట్లు ఇచ్చిన కళాశాల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ రామిరెడ్డి, నారాయణ విద్యాసంస్థల ప్రాంతీయ అధికారి బిఆర్‌రెడ్డి, కృష్ణచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్‌ చెంచురెడ్డి తదితరులు పాల్గొన్నారు.