సరిహద్దుల్లో మొహరించిన భారత బలగాలు

పాక్‌ దాడులను తిప్పికొట్టేందుకు సిద్దం
370 ఆర్టికల్‌ రద్దు చేయాలంటూ యూపిలో నిరసనలు
శ్రీనగర్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దులో అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణం కనపడుతోంది. పాక్‌ బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. పలుచోట్ల కాల్పులకు తెగబడుతున్నాయి. దీంతో భారత సైన్యం అప్రమత్తం అయ్యింది. పాక్‌ సైన్యానికి మన జవాన్లు ధీటుగా సమాధానం చెబుతున్నారు. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. ఎల్‌వోసీకి భారత బలగాలు భారీగా తరలి వెళ్లాయి. అక్కడ ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కోవడానికి బలగాలు సిద్దంగా ఉన్నాయి. ఇదిలావుంటే పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ హిందుత్వవాదులు 600 అడుగుల పాకిస్తాన్‌ జాతీయ జెండాను రోడ్డుపై పరిచి తొక్కుకుంటూ వెళ్లారు. ఆ జెండాను చెప్పులతో కొడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. డౌన్‌ డౌన్‌ పాకిస్తాన్‌ అంటూ నినాదాలు చేశారు. వాహనాలు కూడా ఆ జెండా పై నుంచే వెళ్లాయి. వాహనాలను మాత్రమే కాదని.. కుక్కలను కూడా పాక్‌ జెండాపై నుంచి నడిపిస్తామని నిరసనకారులు చెప్పారు.
కశ్మీర్‌లోని పుల్వామాలో జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అయితే.. ఈ సందర్భంగా నిరసనకారులు ఓ కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. కశ్మీర్‌లోని కొందరు యువకులు భారతీయ సైనికులపై రాళ్లు రువ్వుతున్నారని, అలాంటి రాష్ట్రానికి  గతంలో ఇచ్చిన ప్రత్యేక ¬దాను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్టికల్‌ 370 ప్రకారం ఆ రాష్ట్రానికి  కల్పించిన ¬దాను రద్దు చేయాలని నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.