సర్వేలో లోపించిన సమగ్రత?

కౌలుదార్లు సొంత భూములుగా నమోదు

ప్రభుత్వ భూములకూ ఇదే లెక్క

జనగామ,జూలై10(జ‌నం సాక్షి): ప్రభుత్వానికి సంబంధించిన భూములు, తదితర అంశాలను రైతు సర్వే నివేదికలో విడిగా పేర్కొనాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తాసిల్దార్లకు సూచించారు. దేవాలయ భూములను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారని సమాచారం. అయితే ఆయా గ్రామాల్లో దేవాలయ భూములు ఉన్నా కౌలుదార్లు తమపేరుతో రాయించుకుని వాటిని సర్వేలో చూపారాని సమాచారం. ఉద్యానవనం కింద సాగవుతున్న పండ్లతోటలు, భూముల వివరాలను కూడా పొందుపర్చాలని, సర్వే చేసిన వివరాలన కాపీ, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను తహసీల్దార్ల సహకారంతో నివేదికలకు తుది రూపంలోకి తీసుకురావాలని కోరారు. వ్యవసాయశాఖ సమగ్ర సర్వే ద్వారా వచ్చిన వివరాలను పూర్తిస్థాయిలో నివేదికల రూపంలో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వ్యవసాయ విస్తరణ అధికారులు, సంబంధిత తహసీల్దార్లు సమావేశమై వాటి వివరాలను కూడా నివేదికలో పొందుపర్చాలన్నారు. ప్రభుత్వానికి వివరాలను త్వరితగతిన పంపించాల్సి ఉందని, దరఖాస్తు చేయని వారికి సంబంధించిన భూమి పరిమాణం వివరాలను తెలుసుకోవాలన్నారు. రైతు సమగ్ర సర్వేలో భూముల లెక్కలు ఇంకా పక్కాగా తేలలేదు. రికార్డులకు, క్షేత్రస్థాయిలో పొంతనలేకుండా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. రైతు వారీగా సర్వే నంబర్‌, సాగు విస్తీర్ణంతోపాటు పండించే పంటలు, ఉత్పత్తి, సాగు నీటి వసతి, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు, పంట రుణాలు వంటివి నమోదు చేశారు. కొన్ని గ్రామాల్లో స్థానిక నాయకుల రాజకీయ ఒత్తిడితో రికార్డుల్లో లేని రైతుల పేర్లుకూడా నమోదు చేశారు. వాస్తవానికి ప్రస్తుతం సాగు చేస్తున్నది ఒకరైతే రెవెన్యూ రికార్డుల్లో మరొకరి పేర్లు ఉండడం వల్ల కూడా చాలా భూములు సమగ్ర సర్వే లెక్కల్లోకి ఎక్కలేదని సమాచారం. గ్రామాల వారీగా వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖ సిబ్బంది కలిసి రికార్డులను పరిశీలించి సరిచేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ పలుసార్లు రెండుశాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. జనగామ పట్టణ శివారులో పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా కొందరు వందల ఎకరాల్లో భూములు కొనుగోలు చేసి స్వాధీనంలో ఉంచుకున్నారు. అయితే చాలా భూములు అమ్మిన రైతుల పేరిట మాత్రమే ఉండగా, కొనుగోలు చేసింది ఎవరో తెలియని పరిస్థితుల్లో వాటిని నమోదు చేసుకోలేదు. భూములున్న పట్టాదారులు ఎక్కడో ఉంటే సాగు చేసే వారు మాత్రం గ్రామాల్లో ఉన్నారు. కౌలు రైతుల పేర్లు నమోదు చేయని పరిస్థితి నెలకొంది.