సాగుకు అనుగుణంగా ఎరువులు,విత్తనాలు సిద్దం

సాగువిస్తీర్ణం పెరగనుందని అంచనా
జనగామ,మే31(జ‌నం సాక్షి): ఈ వర్షాకాలంలో జిల్లాలో  1,27,591 హెక్టార్లలో పంటలు సాగు చేసే అవకాశాలున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనాకు వచ్చి ప్రభుత్వానికి నివేదించారు. గత ఏడాదితో పోల్చితే ఈ సారి ఏడు వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంటల సాగు పెరగనుంది. జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్‌లుగా ఉన్న  నవాబ్‌పేట రిజర్వాయర్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌, అశ్వరావుపల్లి రిజర్వాయర్‌, గండిరామారం, బొమ్మకూరు, వెల్దండ, కన్నెబోయిన గూడెం రిజర్వాయర్‌లు నీటితో ఉండడం రైతాంగానికి కలసి రానుంది.  దీనికితోడు ఈసారి ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతులకు ముందస్తు పెట్టుబడి సాయం చేయడంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు జిల్లాకు 29,249 క్వింటాళ్ల విత్తనాలు, 74,514 టన్నుల ఎరువులు అవసరం పడతాయని అధికారులు నివేదించారు. వర్షాలు కురవడానికి ముందస్తుగానే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.వానాకాలం సీజన్‌ వచ్చిందంటే తొలకరి చినుకులు పడగానే విత్తనాలు, ఎరువులకు రైతు అప్పు కోసం షావుకారు, అడ్తిదారుల వద్దకు పరుగెత్తే పరిస్థితి ఉండేది. రైతుకు ముందస్తు పెట్టుబడి అందించాలనే లక్ష్యంతో ఈ నెల 10న రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 13మండలాలు 193 రెవెన్యూ గ్రామాలకు గానూ ఈ పథకం కింద ఖరీఫ్‌ సీజన్‌కు ఎకరాకు రూ.4 వేల చొప్పున రూ.160 కోట్లు మంజూరయ్యాయి. ప్రతీ రోజు మండలానికి మూడు నుంచి 5గ్రామాల చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెక్కులు అందుకున్న రైతులు డబ్బులను ఆయా బ్యాంకుల్లోని తమ ఖాతాల్లో జమచేసుకున్నారు. తొలకరి వాన పడగానే పంటల సాగు కోసం సమాయత్తం అవుతున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారులు వానాకాలం సీజన్‌లో పంటల సాగుకు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది.