సాధ్వి ప్రజ్ఞాకు ఈసీ నోటీసులు

– హేమంత్‌ కర్కరేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాధ్వి
– 24గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశం
భోపాల్‌, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : 2008 సెప్టెంబరు 26న ముంబయిలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఐపీఎస్‌ అధికారి హేమంత్‌ కర్కరేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా లోక్‌సభ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు నోటీసులు జారీ చేసింది. గురువారం సాద్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఈ కేసును సుమోటాగా తీసుకున్న ఎన్నికల అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. సాధ్వి ప్రజ్ఞా వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించామని, దీనిపై అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి నుంచి నివేదిక కోరామని, ఈ ఉదయమే ఆ నివేదిక వచ్చిందని, త్వరలోనే ఆమెకు నోటీసులు జారీ చేయనున్నామని భోపాల్‌ జిల్లా ఎన్నికల అధికారి సుదమ్‌ ఖడే తెలిపారు.  24 గంటల్లోగా ఈ నోటీసులకు ఆమె సమాధానం చెప్పాలని, ఈ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తున్నామని తెలిపారు. మాలెగావ్‌ పేలుళ్ల కేసులో తనను కర్కరే చిత్రహింసలకు గురిచేసినందున సర్వనాశనమైపోతావని శపించానని, ఆ తర్వాత ఆయన మృత్యువాతపడ్డారని గురువారం రాత్రి భోపాల్‌లో భాజపా కార్యకర్తల సమావేశంలో సాధ్వి ప్రజ్ఞా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కాస్త వివాదాస్పదంగా మారాయి. దీనికి ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన నేపథ్యంలో సాధ్వి తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు.