సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే
– చెరిపేస్తే చెరగని చరిత్ర..*
– *చరిత్రను వక్రీభావిస్తున్న మనువాదులు*
*- దొడ్డి కొమురయ్య వద్ద అమరులకు నివాళులు..*
*- సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా*
*దేవరుప్పుల, సెప్టెంబర్ 17 (జనం సాక్షి):* వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను మనువాదులు వక్రీకరిస్తున్నారని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా అన్నారు. దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో కామ్రేడ్ దొడ్డి కొమురయ్య స్మారక స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. వీర తెలంగాణ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదని, వాస్తవ చరిత్ర ఏంటో తెలంగాణ ప్రజానీకానికి తెలుసని ఆయన అన్నారు. ప్రపంచంలో గర్వంగా చెప్పుకోదగిన చరిత్ర తెలంగాణ ప్రాంతానికి ఉందని, అది వీర తెలంగాణ రైతాంగ విప్లవోద్యమం అని తెలిపారు. ఈ పోరాటంలో నాలుగు వేల మంది అమరవీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని, దొరా నీ బాంచన్ కాల్మొక్త అన్న మట్టి మనుషులు బందూక్ పట్టి భూస్వాములను, దొరలను, రజాకార్లను తరిమి కొట్టారని, భారత సైన్యాలను ఎదుర్కొని నిలబడ్డ చరిత్ర ప్రజల సొంతమని చెప్పారు. ఎర్రజెండా నాయకత్వంలో 10 లక్షల ఎకరాల భూమి పంచ బడిందని, మూడు వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. తెలంగాణ సంస్థానం కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్లిందని, కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడంతో భారత పాలకులు నిజాం ప్రభువుపై ఒత్తిడి తీసుకువచ్చి సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారని ఆయన అన్నారు. ఆనాటి పోరాట ఫలితాలు ప్రజలకు అందకుండా విద్రోహానికి పాల్పడ్డారని, పాలకవర్గాల కుట్రను ఆనాడు అర్థం చేసుకున్న ప్రజలు అత్యధిక సీట్లలో కమ్యూనిస్టులను గెలిపించారని తెలిపారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సాయుధ రైతాంగ పోరాటానికి మతం రంగు పులుముతుందని, విమోచన పేరుతో కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పాలక వర్గాల కుట్రల్ని ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు. సాయుధ పోరాట చరిత్రను సమగ్రంగా పాఠ్యాంశాల్లో చేర్చాలని, షేక్ బందగీ, దొడ్డి కొమురయ్య, ఐలమ్మ, ప్రముఖ పోరాటయోధుల విగ్రహాలను ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని, పోరాట చరిత్రను తెలిపేలా ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమ వారసత్వాన్ని నిలబెట్టాలని, అమరవీరుల స్ఫూర్తితో ముందుకెళ్లాలని రమేష్ రాజా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మాన్యపు బుజేందర్, జిల్లా కమిటీ సభ్యులు జీడి సోమయ్య, దొడ్డి కొమురయ్య కుటుంబ సభ్యులు దొడ్డి బిక్షపతి, స్థానికులు, అమరవీరుల కుటుంబాలు, ప్రజాసంఘాల నాయకులు, పాల్గొన్నారు.
Attachments area
ReplyForward
|