‘సారిడాన్‌’పై నిషేదం ఎత్తివేత

– విక్రయాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సుప్రీం
– మరో రెండు ఔషద విక్రయాలు చేసుకోవచ్చని తీర్పు
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం 328 ఔషధాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇందులో నొప్పి నివారణ మాత్ర సారిడాన్‌ కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి సారిడాన్‌, మరో రెండు ఔషధాలను విక్రయించొచ్చని సుప్రీంకోర్టు తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఔషధ తయారీదారులు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్రం స్పందన కోరింది. పెయిన్‌కిల్లర్‌ సారిడాన్‌, స్కిన్‌ క్రీమ్‌ పాన్‌డెర్మ్‌ సహా 328 ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ (ఎఫ్‌డీసీ) ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది. ఎఫ్‌డీసీ మందుల వాడకం వల్ల అందులోని ఔషధ పదార్థాలు రోగికి ఏ విధమైన మేలూ చేయడం లేదని, వీటి విచ్చలవిడి వాడకం నుంచి ప్రజలను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఎఫ్‌డీసీ విధానంలో తయారైన ఈ మందుల్లో వైద్యపరమైన ప్రమాణాలేవీ పాటించడంలేదని దేశ ఔషధ సలహా విభాగమైన డ్రగ్‌ టెక్నికల్‌ అడ్వైజరీ బోర్డు వెల్లడించింది. దీంతో వాటి విక్రయాలపై కేంద్రం నిషేధం విధించింది.
అయితే ఈ నిర్ణయంపై సారిడాన్‌ తయారీ సంస్థ సహా కొన్ని ఫార్మా కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ప్రస్తుతానికి సారిడాన్‌, మరో రెండు మందులపై ఊరట కల్పించింది. కేంద్రం స్పందన తర్వాత మిగతా వాటిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.