సిక్కిం సిగలో తొలి విమానాశ్రయం
విమానాశ్రాయాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
దేశంలో వందో విమనాశ్రయమని మోడీ ప్రకటన
గ్యాంగ్‌టక్,సెప్టెంబర్24(జనంసాక్షి): చాలా ఏళ్ల తర్వాత ఈశాన్య రాష్ట్రమైన సిక్కింకు విమానాశ్రయం కల నెరవేరింది. పాక్యాంగ్‌లో నిర్మించిన విమానాశ్రయాన్ని సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సిక్కింలో ఇదే తొలి ఎయిర్‌పోర్ట్ కావడం విశేషం. భారత్‌లోని రాష్ట్రాల్లో సిక్కింలో మాత్రమే ఇప్పటిదాకా విమానాశ్రయం లేదు. పాక్యాంగ్ విమానాశ్రయ ప్రారంభంతో సిక్కిం కూడా దేశ విమానయాన పటంలో చేరింది. హిమాలయ రాష్ట్రమైన సిక్కింలో పర్వతాలను తొలిచి అనేక సంక్లిష్టతల నడుమ విజయవంతంగా ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తిచేశారు. దీని ప్రారంభంతో రాష్ట్రానికి ఇతర ప్రాంతాలతో అనుసంధానం పెరగడమే కాకుండా పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగుపడతాయి. అక్టోబరు 4వ తేదీ నుంచి పాక్యాంగ్ నుంచి వాణిజ్య విమానాలు నడవనున్నాయి. స్పైస్‌జెట్ కోల్‌కతా నుంచి సిక్కింకు రోజువారీ విమానం నడపనుంది. ఈ విమానాశ్రయ నిర్మాణానికి తొమ్మిదేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. 201ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.605కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. పాక్యాంగ్ గ్రామానికి దాదాపు రెండు కిలోవిూటర్ల దూరంలో పర్వత ప్రాంతంలో ఇది ఉంటుంది. ఇది దేశంలో వందో విమానాశ్రయం కావడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సిక్కిం చేరుకుని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్, విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభుతో పాటు పలువురు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ విమానాశ్రయాన్ని సిక్కిం
ప్రజలకు అంకితమిస్తున్నానని, ఇది దేశంలో వందో ఆపరేషనల్ ఎయిర్‌పోర్ట్ అని మోదీ తెలిపారు. దేశానికి ఇది శతకం అని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఈ విమానాశ్రయం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మోదీ మాట్లాడుతుంటే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సిక్కిం ప్రజలకు ప్రధాని మోదీ ఇస్తున్న కానుక ఇది అని, మరో పది నుంచి పదిహేనేళ్లలో దేశంలో మరో వంద విమానాశ్రయాలు నిర్మిస్తామని కేంద్రమంత్రి సురేశ్ ప్రభు అన్నారు. పాక్యాంగ్ విమానాశ్రయ ప్రారంభం చారిత్రక ఘట్టమని పవన్ చామ్లింగ్ పేర్కొన్నారు. ఇకపోతే
ప్రకృతి అందాలకు పులకరించిన ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిమాలయ రాష్ట్రమైన సిక్కింలోని ప్రకృతి సోయగాలకు ముగ్ధుడయ్యారు. సిక్కింలోని తొలి, ఏకైక విమానాశ్రయాన్ని ఆరంభించడానికి వెళ్లిన ప్రధాని మోడీ అక్కడున్న ప్రకృతి అందాలను చూసి తనను తాను మైమరిచిపోయారు. సిక్కింకు వెళుతున్న దారిలో పర్వత శ్రేణుల్లోని ప్రకృతి అందాలను మెచ్చి ఫోటోలు తీసి ట్వీట్టర్‌లో పోస్టు చేశారు. స్వయంగా అక్కడి అందాలను తన ఫోన్‌తో ఫొటోలు తీశారు. వాటిని సోషల్ విూడియా ద్వారా పంచుకున్నారు. మోడీ ఈ రాష్ట్రాన్ని ప్రశాంతమైన, అద్భుతమైన దిగా పిలుస్తూ ఫోటోలను ఇన్‌క్రెడిబుల్ ఇండియా హ్యాష్ టాగ్‌తో జత చేసి పోస్ట్ చేశారు. బాడోగ్ర నుండి ఎంఐ-8 చాపర్‌లో ఆదివారమే రాజధాని గ్యాంగ్‌టకు చేరుకున్న ఆయనను గవర్నర్ గంగా ప్రసాద్, ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. గ్యాంగ్‌టక్‌కు 33కిలోవిూటర్ల దూరంలో పాక్యాంగ్‌లో ఈ విమానాశ్రయం నిర్మించారు. భారత్-చైనా సరిహద్దుకు దాదాపు 60కిలోవిూటర్ల దూరంలో ఇది ఉంటుంది. రాష్ట్రం ఎంతో నిర్మలమైనదని, అద్భుతంగా ఉందని అన్నారు. ఆ ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ఇన్‌క్రెడిబుల్ ఇండియా హ్యాష్‌ట్యాగ్ జత చేశారు. భారత పర్యాటక రంగం కోసం ఈ ట్యాగ్‌లైన్‌ను ఉపయోగిస్తున్నారు.గ్యాంగ్‌టక్‌కు 33కిలోవిూటర్ల దూరంలో పాక్యాంగ్‌లో ఈ విమానాశ్రయం నిర్మించారు. భారత్-చైనా సరిహద్దుకు దాదాపు 60కిలోవిూటర్ల దూరంలో ఇది ఉంటుంది. అనేక సంక్లిష్టతల నడుమ పర్వత శిఖరాలను తొలిచి రూ.605కోట్లతో విమానాశ్రయ నిర్మాణం చేశారు. దీనిని నిర్మించడానికి తొమ్మిదేళ్లు పట్టింది.