సిగరెట్‌ కాల్చినందుకే ప్రమాదం!

– గతేడాది మార్చిలో నేపాల్‌లో ప్రమాదానికి గురైన విమానం
– సిగరేట్‌ కాల్చడం వల్లనే ప్రమాదమని తేల్చిన అధికారులు
కాఠ్‌మాండూ, జనవరి28(జ‌నంసాక్షి) : కాక్‌పిట్‌లో విమానం నడుపుతున్న పైలట్‌ సిగరెట్‌ కాల్చడం వల్ల నేపాల్‌లోని త్రిభువన్‌ విమనాశ్రయంలో ల్యాండింగ్‌ సమయంలో విమానం ప్రమాదానికి గురైందని దర్యాప్తు సంస్థ తేల్చింది. గత ఏడాది మార్చిలో నేపాల్‌లో విమాన ప్రమాదం చోటు చేసుకోగా.. ఈ ప్రమాదంలో 51మంది ప్రయాణికులు చనిపోయారు. దీంతో  దర్యాప్తు చేపట్టిన అధికారుల..  ప్రమాదానికి గల కారణాలు తాజాగా వెల్లడించారు.  కాక్‌పిట్‌లో పొగ తాగడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు విచారణలో తేల్చారు. యూఎస్‌-బంగ్లా విమానయాన సంస్థకు చెందిన బంబార్డియర్‌ యూబీజీ-211 విమానాన్ని గత ఏడాది మార్చి 12న నేపాల్‌లోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగి విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది సహా 51 మంది చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 67మంది ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీంతో అధికారులు దర్యాప్తు కోసం ప్యానెల్‌ ఏర్పాటు చేశారు. విచారణ చేపట్టిన ప్యానెల్‌ కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ పరిశీలించింది. విమానం నడుపుతున్న సమయంలో పైలట్‌ నిబంధనలకు విరుద్ధంగా కాక్‌పిట్‌లోనే పొగ తాగినట్లు గుర్తించారు. కాక్‌పిట్‌లోని సిబ్బంది నిర్లక్ష్యం, ల్యాండింగ్‌ సమయంలో పరిస్థితిపై అవగాహన కోల్పోవడం కారణంగా విమానం క్రాష్‌ ల్యాండ్‌ అయినట్లు తెలిపింది. పైలట్‌ సిగరెట్‌ తాగడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు.