సిబిఐ వ్యవహారంలో మరో మలుపు

విచారణ కమిటీ నుంచి తప్పుకున్న జస్టిస్‌ సిక్రీ

న్యూఢిల్లీ,జనవరి24(జ‌నంసాక్షి): కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ నుంచి మరో న్యాయమూర్తి తప్పుకున్నారు. ఈ పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే విచారణ ప్రారంభం కాగానే ఈ ధర్మాసనం నుంచి తాను తప్పుకుంటున్నట్లు జస్టిస్‌ ఏకే సిక్రీ తెలిపారు. సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి ఆలోక్‌ వర్మను తొలగించిన కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందు వల్లే ఈ విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్‌ సిక్రీ తెలిపారు. ఈ వ్యవహారంలో నా స్థానమేంటో విూకు తెలుసు. నేను ఈ విచారణ చేపట్టలేను. ఈ ధర్మాసనం నుంచి స్వయంగా తప్పుకుంటున్నాను. కేసు విచారణను శుక్రవారం మరో ధర్మాసనం చేపడుతుంది’ అని పిటిషన్‌ దాఖలు చేసిన ఎన్జీవో కామన్‌కాజ్‌ తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవేతో జస్టిస్‌ సిక్రీ అన్నారు. ఇప్పటికే ఈ కేసు విచారణ ధర్మాసనం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ కూడా తప్పుకున్న విషయం తెలిసిందే. సీబీఐ నూతన డైరెక్టర్‌ను ఎంపిక చేసే ఉన్నత స్థాయి సెలక్షన్‌ కమిటీలో సీజేఐ గొగొయ్‌ కూడా సభ్యుడిగా ఉన్నారు. ఈ కమిటీ గురువారమే సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు నియామకంపై కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు గత సోమవారం జస్టిస్‌ గొగొయ్‌ ప్రకటించారు. తాజాగా సిక్రీ కూడా తప్పుకోవడంతో కేసు విచారణ మరింత ఆలస్యం కానుంది.