సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం అయిన వైద్యశాఖ

ముందస్తు శిబిరాలతో ప్రజల్లో చైతన్యం

అంటువ్యాధులపై ప్రజలకు సూచనలు

భూపాలపల్లి,జూలై6(జ‌నం సాక్షి): సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం అయిన అధికారులు పిహెచ్‌సిలను సన్నద్దం చేశారు. స్పీకర్‌ మధుసూధనాచారి సొంత జిల్లా కావడంతో అధికారులు మరింత శ్రద్ద తీసుకుంటున్నారు. వర్షాకాలం సీజన్‌ కావడంతో గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలకు ఉపక్రమించారు.సీజనల్‌ వ్యాధులను ఎదుర్కోవడానికి ఆయా శాఖలను సమన్వయపరుస్తూ ముందుకు సాగుతున్నారు. పంచాయతీరాజ్‌, మున్సిపాలిటీ, ఆర్‌డబ్ల్యూ స్‌ అధికారులతో కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఇటీవల సవిూక్షా సమావేశం నిర్వహించారు. సీజనల్‌ వ్యాధులను నిర్మూలించడంలో వైద్యశాఖతోపాటు అంతా భాగస్వాములు కావాలని కోరారు. తాగునీటి పైపులైన్‌లు లీకేజీ కాకుండా ఆర్‌డబ్ల్యూస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాకాలం మొదలైన నేపథ్యంలో ప్రజలు వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు, వైద్యశాఖ తీసుకుంటున్న చర్యల గురించి డీఎంహెచ్‌వో డీఎంహెచ్‌వో డాక్టర్‌ అప్పయ్య వివరించారు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించామని, గిరజిన ప్రాంతాల్లో ప్రత్యేంగా ఈ విషయమై శిక్షణ కూడా ఇచ్చామని అన్నారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలను అప్రమత్తం చేశాం. ఆయా గ్రామాల్లో ఐదుగురి కంటే ఎక్కువ మంది జ్వరాలతో బాధపడుతుంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరాం. మలేరియా మందులు, ఆంటీబయోటిక్స్‌ సరిపడా అందుబాటులో ఉన్నాయి. స్టాక్‌లేని వారు వెంటనే ఇండెంట్‌ పెట్టాలని కోరాం. అంతా దోమతెరలను వాడాలని అవగాహన కల్పించాలని తమ సిబ్బందిని ఆదేశించామన్నారు. మలేరియా, డయేరియా, డెంగీ, శ్వాసకోశ వ్యాధులు దాడి చేయకుండా ముందస్తు చర్యలకు సిద్ధమయ్యామని అన్నారు. గ్రామాల్లో వైద్య సిబ్బందిని అలర్ట్‌ చేశామని, సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించాలని ఆదేశించినట్లు తెలిపారు.ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సమస్యాత్మక గ్రా మాలపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. వర్షాలు పడితే దారులు మూసుకుపోయే గ్రామాల్లోని గర్భిణులను గుర్తించి ముందుగానే సవిూప దవాఖానల్లో చేర్పించాలని మెడికల్‌ అధికారులను ఆదేశించాం. ఆయా గ్రామాలజాబితాను ఆయా వైద్యాధికారులకు పంపించి అప్రమత్తం చేశామన్నారు. ఇప్పటికే జిల్లాలో లక్షా 5 వేల దోమ తెరలను పంపిణీ చేశామని, వైద్య శిబిరాలు నిర్వహించడానికి సరిపడు మందులు రెడీగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని సమస్యాత్మక గ్రామాల్లో వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయన్నారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యుల కొరత ఉన్నా ఈ సీజన్‌లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రధానంగా పారిశుధ్యంపై ప్రజలను చైతన్యం చేస్తున్నామని అన్నారు.