సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం
కాకినాడ,ఆగస్ట్16(జనం సాక్షి): వర్షాకాలం నేపథ్యంలో అపరిశుభ్రత వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి సూచించారు.వర్షాకాలంలో తరచూ జలుబు, మలేరియా, టైఫాయిడ్, కామెర్లు, డెంగ్యూ, ఎలర్జీ, చికెన్‌గున్యా, ఆయాసం, శ్వాసకోశ వ్యాధులతో పాటు విరేచనాలు కూడా అవుతాయన్నారు. అలాగే ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఇలాంటి వాటిని గుర్తించి తక్షణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులను సంప్రదించాలన్నారు. మలేరియా వస్తే చలి జ్వరం వస్తూ ఉంటుంది. డెంగ్యూ సోకితే అధిక ఉష్ణోగ్రత, తలనొప్పి, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. టైఫాయిడ్ వస్తే జ్వరం తగ్గదు. వాంతులు అవుతాయి. ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వల్ల చంకలో, గజ్జల్లో తామర వస్తుందని అన్నారు. ఇలాంటి లక్షణాలు గుర్తిస్తే స్థానికంగా వైద్యుల సహకారం తీసుకుని మందులు వాడాలని అన్నారు. వ్యాధులు దరిచేరకుండా వ్యక్తిగత పరిశభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటితో పాటు పరిసరాల్లో వాడి పడేసిన కొబ్బరి బొండాలు, టైర్లలో నీరు నిల్వ ఉండకుండా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉన్నచోట దోమల లార్వా ఉత్పత్తి అవుతుంది. ప్రతి ఒక్కరూ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే రోగాలకు దూరం కావచ్చన్నారు.