సీబీఐ విచారణకు..  సీపీ హాజరుకావాల్సిందే!


– కేసు విచారణలో పూర్తిగా సహకరించాలి
– సీపీపై అరెస్టు కానీ, ఎలాంటి బలవంతపు చర్యలకు సీబీఐ దిగొద్దు
– బెంగాల్‌ వ్యవహారంలో స్పష్టం చేసిన సుప్రింకోర్టు
– కోర్టు ధిక్కారం పిటీషన్‌పై సమాధానం చెప్పండి
– సీపీతో పాటు బెంగాల్‌ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
– తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా
– సుప్రీం తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన మమత
న్యూఢిల్లీ, ఫిబ్రవరి5(జ‌నంసాక్షి) : పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మంగళవారం ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. శారదా చిట్‌ఫండ్స్‌ కుంభకోణం కేసులో ఆధారాలు మాయం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా సీపీ రాజీవ్‌ కుమార్‌ను సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. తటస్థ ప్రదేశమైన మేఘాలయలోని షిల్లాంగ్‌లో సీపీ రాజీవ్‌ కుమార్‌ సీబీఐ ముందు హాజరు కావాలని సూచించింది. కేసు విచారణలో సీబీఐకి సీపీ పూర్తిగా సహకరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి అరెస్టు సహా ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలకు దిగరాదని సీబీఐకి ఆదేశాలు జారీ చేశారు. సీబీఐ దాఖలు చేసిన కోర్టు ధిక్కారం పిటిషన్‌పై సమాధానం చెప్పాలంటూ కోల్‌కతా సీపీతో పాటు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం, డీజీపీలకు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
సుప్రీం తీర్పుపై మమత హర్షం…
పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం, సీబీఐ మధ్య చోటుచేసుకున్న వివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నట్టు సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. అధికారులకు నైతిక బలాన్ని నింపేలా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు మా నైతిక విజయమని, సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలన్నిటిపైనా మాకు అపార గౌరవం ఉందన్నారు. వాటికి మేము కట్టుబడి ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. ప్రతి ఫెడరల్‌ దేశంలోనూ కేంద్ర, రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉంటాయనీ… అలాగే వాటికి న్యాయ స్థానాలు కూడా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోని అధికారులను అరెస్టు చేయడానికి కేంద్ర యంత్రాంగం వచ్చినప్పుడు తాము ఎప్పుడూ అడ్డుకోబోమనీ, అయితే ప్రస్తుతం జరుగుతున్నది రాజ్యాంగ సంక్షోభమని సీఎం మమత పేర్కొన్నారు. తాను విచారణకు అందుబాటులో ఉండడనని సీపీ రాజీవ్‌ కుమార్‌ ఎప్పుడూ చెప్పలేదని ఆమె గుర్తుచేశారు. ఒక తటస్థ ప్రదేశంలో తాము విచారణకు హాజరవుతామని మాత్రమే ఆయన చెప్పారు. ఇంకా స్పష్టమైన వివరణ కావాలంటే కూర్చొని మాట్లాడేందుకు మేము సిద్ధమని, వాళ్లు చేస్తున్నది ఏమిటి? ఆయన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారన్నారు. ఎలాంటి నోటీసు లేకుండా ఆదివారం రోజు రహస్యంగా ఆయన ఇంటికి వెళ్లారని, కోర్టు కూడా ఆయనను అరెస్టు చేయవద్దని స్పష్టంగా చెప్పిందని, ఇది అధికారులకు నైతిక బలాన్ని ఇస్తుందని మమత పేర్కొన్నారు.