సీసీఐ పునరుద్ధరిస్తే రాష్ట్ర ప్రభుత్వం
ఆదిలాబాద్: సీసీఐని వెంటనే తెరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి హరీశ్ డిమాండ్ చేశారు. సీసీఐ విషయంలో ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. బీజేపీ నేతలకు దమ్ముంటే సీసీఐ తెరిపించాలన్నారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి సీసీఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. సీసీఐ పునరుద్ధరిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని రాయితీలు కల్పిస్తామన్నారు. కేంద్రానికి చేతకాకపోతే రాష్ట్రానికి అప్పగించాలని తెలిపారు. సీసీఐ కోసం చేస్తున్న ఆందోళనకు టీఆర్‌ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ప్రజల తిరుగుబాటు తప్పదన్నారు.
నిరుద్యోగ యువతను బండి సంజయ్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీసీఐ పునరుద్ధరణ కోసం నోరుమెదపని బండికి రాష్ట్ర ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం ఎంత పెరిగిందో.. ఉద్యోగాలు లేక యువత ఎంత బాధ పడుతున్నారో బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత నియామకాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ, పోలీసు, సింగరేణి, గురుకులాలు, విద్యుత్, మెడికల్ హెల్త్ తదితర విభాగాల్లో మొత్తం 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. మరో 50 నుంచి 60 వేల పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. బీజేపీ నాయకులకు తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు.. నోటిఫికేషన్ల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.
దేశంలో నిరుద్యోగం శాతం 7.91 శాతం ఉండగా, తెలంగాణలో 2.2 శాతం మాత్రమే ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. నిరుద్యోగ రేటు తక్కువగా ఉన్న 5 రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. కేంద్రం లెక్కల్లో 15,62,962 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆర్మీలో 2 లక్షలు, రైల్వేల్లో మూడు లక్షలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు.
కేంద్రం ఇప్పటికే అనేక సంస్థలను ప్రైవేట్‌కు అమ్మేసిందని, దీంతో వేల మంది రోడ్డున పడ్డారని చెప్పారు. ఇప్పుడు ఎల్‌ఐసీ సహా అనేక కంపెనీల వాటాలను అమ్మకానికి పెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎయిర్ ఇండియాను టాటాలకు అప్పగించారని, IDBI సహా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తున్నదని వెల్లడించారు. విచ్చలవిడిగా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం వల్ల దాదాపు రెండున్నర లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఆ కుటుంబాలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు.