సుప్రీంకోర్టు సీజేగా.. జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌

– నియామక దస్త్రంపై సంతకం చేసిన రాష్ట్రపతి
– అక్టోబర్‌3న బాధ్యతలు స్వీకరించనున్న గొగోయ్‌
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నియమితులయ్యారు. ఆయన నియామక దస్త్రంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం సంతకం చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అక్టోబర్‌ 2న పదవీవిరమణ చేయనుండగా.. అక్టోబర్‌ 3న రంజన్‌ గొగోయ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. దీపక్‌ మిశ్రా పదవీకాలం ముగియనుండటంతో తదుపరి వారసుడి పేరు సిఫార్సు చేయాల్సిందిగా ఆయనకు న్యాయ మంత్రిత్వశాఖ ఇటీవల లేఖ రాసింది. సాధారణంగా సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిని తన వారసుడిగా సీజేఐ సిఫార్సు చేస్తుంటారు. ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. సర్వోన్నత న్యాయస్థానంలో తన తర్వాత అత్యంత సీనియర్‌గా ఉన్న జస్టిస్‌ గొగొయ్‌ పేరును సీజేఐ సిఫారసు చేశారు. సదరు సిఫార్సును కేందప్రభుత్వం ఆమోదించి రాష్ట్రపతి నిర్ణయం కోసం పంపింది. సదరు దస్త్రంపై రాష్ట్రపతి గురువారం సంతకం చేయడంతో నియామక పక్రియ పూర్తయింది. వచ్చే ఏడాది నవంబరు 17 వరకు జస్టిస్‌ గొగోయ్‌ ఈ పదవిలో కొనసాగుతారు. జస్టిస్‌ గొగొయ్‌ 1954లో అసోంలో జన్మించారు. 1978లో బార్‌ అసోసియేషన్‌లో చేరారు. 2001 ఫిబ్రవరి 28న గువాహాటి హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. 2010 సెప్టెంబరులో పంజాబ్‌, హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2011 ఫిబ్రవరిలో అదే హైకోర్టుకు
ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2012 ఏప్రిల్‌లో పదోన్నతి పొందారు. మృదుభాషిగా పేరుపొందిన ఆయన.. పనిలో మాత్రం నిక్కచ్చిగా ఉంటారు. కేసుల కేటాయింపులో సీజేఐ జస్టిస్‌ మిశ్రా వ్యవహరిస్తున్న తీరును విమర్శిస్తూ ఈ ఏడాది జనవరిలో విలేకర్ల సమావేశం నిర్వహించిన నలుగురు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తుల్లో జస్టిస్‌ గొగొయ్‌ కూడా ఒకరు.