సూర్యాపేట అభివృద్ధిపై.. 

బహిరంగచర్చకు సిద్ధం
– నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా రెడీ
– ప్రతిపక్షాలకు మంత్రి జగదీశ్‌ రెడ్డి సవాల్‌
సూర్యాపేట, జూన్‌26(జ‌నం సాక్షి) : తెరాస అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో సూర్యాపేట అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనైనా చర్చించేందుకు రెడ్డీ ఉన్నానని రాష్ట్ర మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు. నియోజకవర్గంలోని కాసరబాద్‌ గ్రామంలో మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మరియు మహాత్మ గాంధీ విగ్రహ ఆవిష్కరించారు.  అనంతరం గ్రామంలో రూ. 50 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్‌ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడారు. వేల కోట్ల రూపాయలతో సూర్యాపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని, నియోజకవర్గ అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తేల్చిచెప్పారు. సూర్యాపేటలో జరిగిన అభివృద్ధిని లెక్కలతో సహా వివరిస్తామని, ప్రతిపక్షాలకు దమ్ముంటే చర్చకు రావాలని మంత్రి జగదీష్‌ రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు. గత పాలకులు సూర్యాపేటలో చేసిన అభివృద్ధి శూన్యమని, వచ్చిన నిధులను ఖర్చు పెట్టలేని నాయకులు, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవై ఏండ్లలో జరగని అభివృద్ధి మూడేండ్లలోనే జరిగిందని, ప్రజలకు ఇచ్చిన హావిూలను 100 శాతం అమలు పరచిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతున్నదని ఆయన అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. అన్ని వర్గాలను సమాన అభివృద్దిపరుస్తూ కేసీఆర్‌ దేశవ్యాప్తంగా మనన్నలు పొందుతున్నారన్నారు. రైతు సమితులు, రైతు బంధు, రైతు బీమాలతో రైతులకు పెద్దన్నలా కేసీఆర్‌ నిలిచారని, ఈ పథకాలను చూసి దేశం మొత్తం నివ్వెరపోతుందన్నారు. దేశం మొత్తం తెలంగాణ పాలనను మెచ్చుకుంటుంటే ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు మాత్రం కళ్లుండి చూడలేని స్థితిలో ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ అడ్రస్సు ఎక్కడ గల్లంతవుతుందోనని ఆందోళనతోనే మతిస్థిమితం లేని వారిలా కాంగ్రెస్‌, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెరాస నేతలు, అధికారులు పాల్గొన్నారు.