సెప్టెంబర్ 18 నుంచి..
అమెరికా వస్తువులపై సుంకాల పెంపు అమలు
న్యూఢిల్లీ, ఆగస్టు4(జనం సాక్షి) : అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై విధించిన సుంకాన్ని సెప్టెంబర్ 18 నుంచి అమలు చేయనున్నట్లు భారత్ ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే కొన్ని వస్తువులపై భారత్ సుంకాలు పెంచుతూ గతంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెల నుంచి ఈ సుంకాల పెంపును అమలు చేయనున్నట్లు భారత్ వెల్లడించింది. సెప్టెంబర్ 18నుంచి సుంకాల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. అమెరికా గత కొన్నిరోజులుగా విదేశీ వస్తువులపై సుంకాలు పెంచుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇతర దేశాలు కూడా దీటుగానే స్పందిస్తున్నాయి. సుంకాల పెంపు నుంచి భారత వస్తువులను మినహాయించాలని కోరగా అమెరికా తిరస్కరించడంతో.. బదులుగా భారత్ కూడా పన్నులు పెంచింది. పలు అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచాలని భారత్ ఈ ఏడాది జూన్‌లో నిర్ణయం
తీసుకుంది. ఆగస్టు 4 నుంచి పెంచిన సుంకాలు అమలు చేయాలని భావించింది. కానీ తేదీని సెప్టెంబరు 18కు మార్చింది. అమెరికా నుంచి భారత్‌కు దిగుమతి చేసుకునే బాదం, వాల్‌నట్స్, ఆపిల్స్, తదితర ఉత్పత్తులపై సుంకాలు పెరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి భారత్, అమెరికాల మధ్య వాణిజ్య సంబంధ వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ సుంకాల విధానం కారణంగా భారత్ వల్ల అమెరికాకు కలుగుతున్న వాణిజ్యలోటును తగ్గించే ప్రయత్నం చేస్తున్నానని ట్రంప్ చెప్తున్నారు. కేవలం భారత్‌తోనే కాకుండా ఇతర దేశాలతోనూ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు.