సొంత జిల్లా ఆత్మహత్యలపైనా దృష్టి పెట్టని సిఎం కెసిఆర్
మెదక్,ఫిబ్రవరి17(జనంసాక్షి) : రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన నిధులపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి డిమాండ్ చేసింది. కేంద్రం నిధుల విడుదల చేస్తున్నా పట్టించుకోకుండా సర్కార్ వ్యవహరిస్తోందని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి రాకముందు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి నేడు రూ.30 వేలు మాత్రమే మాఫీ చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రైతుల ఆత్యహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయని అన్నారు. గజ్వెల్ నియోజకవర్గంలోనే ఇవి ఎక్‌ఉవగా ఉన్నాయని అన్నారు. బంగారు తెలంగాణ వస్తుందని ఆనందించిన రాష్ట్ర ప్రజలు, రైతులకు కష్టాలు మొదలయ్యాయని చెప్పారు. ఇప్పటివరకు రైతు ఆత్మహత్యల నివారణపై ముఖ్యమంత్రి ఎలాంటి కమిటీ వేసి పరిశీలన చేయలేదని తెలిపారు. అఖిలపక్ష నాయకులతో పంట నష్టాలు, ఆత్మహత్యలకు గల కారణాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులను అదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కరవు సమయంలో సీఎం, మంత్రులు ‘పంట విరామం’ ప్రకటించాలని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. రైతుల ఆత్మహత్యలను నిరోధించి, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు.