సోషల్‌విూడియా వల్లే ..  విమాన ప్రమాదాలు!


– వాయు సేనాధిపతి మార్షల్‌ బీఎస్‌ ధనోవా
బెంగళూరు, సెప్టెంబర్‌15(ఆర్‌ఎన్‌ఎ) : సోషల్‌ విూడియా వల్ల విమాన ప్రమాదాలా..!! వినడానికి కొంత ఆశ్యర్యం కలిగిస్తున్నా నిజమేనని వాయు సేనాధిపతి మార్షల్‌ బీఎస్‌ ధనోవా పేర్కొంటున్నారు.
ఎయిర్‌ఫోర్స్‌ పైలట్లు సోషల్‌విూడియాకు ఎక్కువగా బానిసవడం వల్లే విమాన ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 2013లో రాజస్థాన్‌లో ఓ యుద్ధ విమానం కూలిపోవడానికి కారణం ఇదేనని చెప్పారు. బెంగళూరులో ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ ఏరోస్పేస్‌ మెడిసిన్‌ 57వ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ధనోవా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పైలట్లు రాత్రులు గంటల తరబడి సామాజిక మాధ్యమాలను వినియోగించడం వల్ల వారు కంటినిండా నిద్రపోవట్లేదని, చాలామంది పైలట్ల పరిస్థితి ఇలాగే ఉంటోందన్నారు. దీంతో ఉదయాన్నే విధుల్లోకి వచ్చేప్పుడు వారు అలసటగా కన్పిస్తున్నారని తెలిపారు. సాధారణంగా ఉష్ణోగ్రత 40డిగ్రీ సెల్సియస్‌ దాటిన తర్వాత విమానాల శిక్షణ ఇవ్వమని, అందుకే ఉదయం 6 గంటలకే పైలట్లు శిక్షణ విమానాలు నడుపుతుంటారని అన్నారు. అయితే
రాత్రి సరిగ్గా నిద్ర ఉండక పైలట్లు విమానం నడుపుతున్నప్పుడు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, తద్వారా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయని ధనోవా తెలిపారు. 2013లో రాజస్థాన్‌లోని బర్మేర్‌ సవిూపంలో కూలిన యుద్ధవిమాన ఘటనకు ఇదే కారణమని, ఆ విమానాన్ని నడిపిన పైలట్‌ గత కొన్ని రోజులుగా సరిపడా నిద్ర పోలేదని, ఈ పరిస్థితి తాజాగా వాయుసేనకు సవాలుగా మారిందని ధనోవా తెలిపారు. దీన్ని నివారించాలంటే పైలట్లు రాత్రి కంటినిండా నిద్ర పోయారా లేదా తెలుసుకునేందుకు ఓ వ్యవస్థను తీసుకురావాలని ధనోవా ఏరోస్పేస్‌ మెడిసిన్‌ ఇనిస్టిట్యూట్‌ను కోరారు. ప్రస్తుతం పైలట్లు మద్యం సేవించారో లేదో తెలుసుకునేందుకు శ్వాస పరీక్షలు ఉన్నాయి. అలాగే నిద్రపోయారో లేదో తెలుసుకునేందుకు కూడా ఒక వ్యవస్థను తీసుకురావాలని, అప్పుడే ఇలాంటి ప్రమాదాలు నివారించగలం అని ధనోవా అన్నారు.