స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు భారీ లాభాలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ రోజు మార్కెట్ ప్రారంభమే రికార్డు స్థాయిలో 61,088 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత కాసేపు జోరు తగ్గినట్టు కనిపించినా అది తాత్కాలికమే అయ్యింది. మధ్యాహ్నం తర్వాత సూచీలు అంతర్జాతీయ సానుకూల పవనాలతో ఆకాశమే హద్దు దూసుకెళ్లాయి. వీటికి తోడు 21 కంపెనీలు నేడు ఫలితాలు వెల్లడించనున్నాయి అనే వార్తలు మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచింది. చివరకు, సెన్సెక్స్ 568.90 పాయింట్లు (0.94%) పెరిగి 61,305.95 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 176.70 పాయింట్లు (0.97%) పెరిగి 18,338.50 వద్ద ముగిసింది. సుమారు 1596 షేర్లు అడ్వాన్స్ అయితే, 1541 షేర్లు క్షీణించాయి, 103 షేర్ల విలువ మారలేదు. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ రూ.75.38 వద్ద ఉంది. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, విప్రో, గ్రాసీమ్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రధాన లాభాలను పొందగా.. కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఆటో రంగం మినహా అన్ని ఇతర సెక్టోరల్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇన్ ఫ్రా, ఐటీ, రియాల్టీ, పిఎస్‌యు బ్యాంక్, పవర్, మెటల్ సూచీలు ఒక్కొక్కటి ఒక శాతం పెరిగాయి.