స్టీరింగ్‌ లేని కారు వచ్చేస్తోందహో !

మీరు కారును ఎలా నడుపుతారు ? ఏముంది.. స్టీరింగ్‌ తిప్పుతూ, గేర్లు మార్చుతూ అంటారా ? మీరు చెప్పింది కరెక్టే ! కానీ, భవిష్యత్తులో మీరు కారు నడపాలంటే స్టీరింగూ, గేర్లు వాడాల్సిన అవసరం ఉండక పోవచ్చు. ఏందీ నమ్మడం లేదా ? నిజమండీ.. ఇది నిజంగా నిజం.. పరిస్థితులన్నీ అనుకూలిస్తే అలాంటి స్టీరింగ్‌, గేర్లు లేని కారును త్వరలోనే మనమూ నడిపే ఛాన్సుంది. ఈ కారును మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెజ్‌’ సన్నాహాలు చేస్తోంది. ఆ కార్‌ మోడల్‌ పేరు ‘మెర్సిడెస్‌ బెన్జ్‌ ఎస్సీఎల్‌ 600’ అని నిర్ణయించింది. డ్రైవర్‌ లేకుండా, గేర్లు వేయకుండా కారు ఎలా నడుస్తుందనుకుంటున్నారా ? మన తాత చేతి కర్ర సాయంతో నడిచినట్లు ఈ కారులో స్టీరింగ్‌ స్థానంలో ఓ ఎలక్ట్రానిక్‌ రాడ్‌ ఉంటుంది. దీన్ని అటూ ఇటూ ఊపితే చాలు కారు ఏ పక్క కావాలంటే ఆ పక్కకు మలుగుతుంది. ఇక గేర్ల స్థానంలో ఓ ముందు భాగాన ఓ మానిటర్‌ ఉంటుంది. కారు వేగాన్ని గేర్ల సహాయంతో కంట్రోల్‌ చేసినట్లు ఈ మానిటర్‌లో బటన్లను నొక్కితే చాలు కారు మన అదుపులోనే ఉంటుంది. వ్వావ్‌.. వాట్‌ ఏ కార్‌ ! అనుకుంటున్నట్లున్నారు ! టెక్నాలజీ సార్‌.. టెక్నాలజీ ! ఈ కారు కోసం జరుగుతున్న ప్రయోగాలన్నీ సక్సెస్‌ అయితే ఇక మనం డ్రైవింగ్‌ నేర్చకునే పని లేదు. డ్రైవర్‌ను పెట్టుకునే పని లేదు. బటన్లు నొక్కడం తెలిస్తే చాలు !