స్మృతి ఇరానీతో భేటీ అయిన‌ కేటీఆర్

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి) : ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేనేత సమస్యలపై కేంద్రమంత్రితో కేటీఆర్ చర్చించారు. కేంద్రమంత్రితో సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. చేనేత కార్మికుల సమస్యలను కేంద్రమంత్రికి వివరించామని తెలిపారు. అదే విధంగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ర్ట ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ర్టానికి కొత్తగా 10 క్లస్టర్లు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరామని చెప్పారు. ఈ క్లస్టర్ల వల్ల ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు ప్రయోజనం ఉంటుందన్నారు. మరమగ్గాల ఆధునికీకరణకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి చెప్పారు. 8 వేల మరమగ్గాల ఆధునీకరణకు కేంద్ర నిధులు కోరామని పేర్కొన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని కేటీఆర్ తెలిపారు.