స్వచ్ఛభారత్‌ను నిర్మించేందుకు..  ప్రతి ఒక్కరూ సహకరించాలి


– దేశ ప్రధాని నరేంద్ర మోదీ
– ‘స్వచ్ఛతా హిసేవా’ ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాని
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి) : గాంధీజీ కలలుగన్న స్వచ్ఛభారత్‌ను నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛతా హి సేవా’ ఉద్యమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు వర్గాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన మోదీ.. పరిశుభ్ర భారత్‌ కోసం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. అనంతరం ప్రధాని మోదీ స్వయంగా స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం న్యూఢిల్లీ పహర్‌గంజ్‌ ప్రాంతంలోని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఉన్నత పాఠశాలకు వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ శ్రమదానం చేశారు. చీపురు చేతబట్టి పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. స్వచ్ఛభారత్‌ కోసం విద్యార్థులు పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. అంతకుముందు ప్రధాని కార్యాలయం నుంచి పాఠశాలకు బయల్దేరిన ప్రధాని మోదీ.. ఎలాంటి సెక్యూరిటీ రూట్‌ లేకుండా సాధారణ మార్గంలో ప్రయాణించారు. దీంతో మోదీ కాన్వాయ్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. కాసేపటికే ట్రాఫిక్‌ క్లియర్‌ అయిన తర్వాత మోదీ పాఠశాలకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భాజపా నేతలు, ప్రజాప్రతినిధులు ఈ స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ అక్కడి పరిసరాలను శుభ్రం చేశారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చీపురుపట్టి వీధులు శుభ్రం చేశారు.