స్వతంత్ర భారతంలో నగదు బదిలీ విప్లవాత్మకం

సోనియాగాంధీ
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 15 (జనంసాక్షి):
నిరుపేదల ఆకలి తీర్చే ఆహారభద్రతా బిల్లును త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు యూపిఏ చైర్‌ పర్సన్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ చెప్పారు. దేశంలో నిరుపేదలు ఎవరూ ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంతో ఆహార భద్రత చట్టాన్ని తెచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడిఉందని ఇందుకు త్వరలోనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ఆమె చెప్పారు. శనివారంనాడు ఢిల్లీప్రభుత్వం ఆధ్వర్యంలో ‘అన్నశ్రీ’ పథకాన్ని ఆమె ప్రారం భించారు. ఈ పథకంలో రూ.600లు చొప్పున కుటుంబంలోని మహిళ పేరుమీదుగా నేరుగా సబ్సీడీ సొమ్ము బ్యాంక్‌ అకౌంట్‌లో జమ అవుతుంది. రెండు లక్షల నిరుపేదల కుటుంబాలలోని వృద్ధమహిళల పేరు మీద ఈ సొమ్ము నేరుగా అందే అవకాశం కల్పించారు. ఈ పథకం ప్రారంభోత్సవాన్ని సోనియా నగదు బదిలీ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే అవకాశంగా మలచుకున్నారు. జనవరి 1 నుంచి దేశంలోని 51 జిల్లాలో నగదు బదిలీ పథకం అమలు కానున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో అర్హులైనవారికి 34 పథకాల ద్వారా నేరుగా లబ్ది చేకూరుతుంది. ‘అన్నశ్రీ’ పథకాన్ని పూర్తిగా ఆధార్‌ కార్డుల ఆధారంగానే తొలిసారిగా అమలు చేయడాన్ని ఆమె ప్రశంసించారు. యూపిఏ ప్రభుత్వం చేపట్టనున్న నగదు బదిలీ పథకం(అప్కా పైసా అప్కేహాత్‌మే) ఒక విప్లవాత్మక చర్యగా సోనియా అభివర్ణించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా యూపిఏ ఆచరించే సమతుల అభివృద్ధి సిద్ధాంతం ఆధారంగా ఈ పథకం రూపొందించబడిందని ఆమె చెప్పారు. అయితే ఈ పథకంలో ఆహార, ఎరువుల సబ్సీడీ కార్యక్రమాలు పొందుపరచలేదు. ఫెన్షన్లు, స్కాలర్‌షిప్‌లు, ఉపాధి హామీతోపాటు సామాజిక లబ్ది పథకాలలో లబ్దిదారులకు నేరుగా సొమ్మును అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించామని ఆమె చెప్పారు. ఈ పథకం వల్ల లబ్దిదారులకు జాప్యం లేకుండా నేరుగా నగదు బ్యాంకుల ద్వారా గానీ, పోస్టు ఆఫీసుల ద్వారా గానీ అందుతుందని ఆమె చెప్పారు. ఇటీవల కేంద్ర కేబినెట్‌ భూసేకరణ బిల్లుకు ఆమోదం తెలపడం పట్ల ఆమె అభినందించారు. త్వరలోనే ఆహారభద్రత బిల్లును కూడా ప్రవేశపెడతామని సోనియా ప్రకటించారు.