స్వామి దర్శనానికి పెరిగిన రద్దీ

తిరుమల,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): దాదాపు ఎనిమిది రోజుల తర్వాత తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా రెండోరోజు శనివారం కూడా భక్తుల రాక పెరిగింది. శనిఆదివారాలు కావడంతో స్వామినిదర్శించుకునేందుకు వచ్చారున మహాసంప్రోక్షణ సందర్భంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ప్రకటించడంతో భక్తులు సహకరించి కొండ పర్యటన వాయిదా వేసుకున్నారు. 11వ తేదీ అంకురార్పణ నుంచి మహాసంప్రోక్షణ వరకు ఆరు రోజుల్లో 1.71 లక్షల మంది మాత్రమే స్వామిని దర్శించుకున్నారు. కాగా, గురువారంతో మహాసంప్రోక్షణ క్రతువు ముగియటంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి తిరుమలలో రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల సమయానికి 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా దర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు ప్రకటించారు. మరోవైపు ఆర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్యదర్శనం, వృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డ తల్లిదండ్రుల దర్శనాలు యధావిధిగా కొనసాగాయి. మహాసంప్రోక్షణ తరవాత స్వామిని దర్శించుకోవాలన్న తలంపుతో వచ్చామని పలువురు తెలిపారు.

తాజావార్తలు