హమీలు అమలు చేస్తాం

` ప్రజాపాలనపై మంత్రుల దిశానిర్దేశం
` కొత్త రేషన్‌ కార్డుల జారీకి విధివిధానాలు ఖరారు కాలేదు
` మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌
` ప్రభుత్వానికి కళ్లు, చెవులు ప్రభుత్వ అధికారులే
` మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ
` ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఆరు గ్యారంటీలు అమలు
` మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్‌్‌(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ పరిధిలో ‘ప్రజాపాలన’ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ సవిూక్ష నిర్వహించారు. 150 డివిజన్లలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మంత్రులు తెలిపారు.ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘’ప్రజా పాలనలో స్వీకరించే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తాం. రేషన్‌ కార్డులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కొత్తవి చేర్చడం, పాతవి తీసేయడం జరగలేదు. కొత్త రేషన్‌ కార్డుల జారీకి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. లబ్ధిదారుల ఎంపికకు నిబంధనలు రూపొందించాల్సి ఉంది. ఆశావహుల డేటా సేకరణ కోసమే దరఖాస్తుల స్వీకరణ. ఇప్పటికే పింఛను తీసుకుంటున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇందిరమ్మ ఇల్లు కావాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. ప్రజావాణిలో ఇప్పటివరకు 25వేల దరఖాస్తులు వచ్చాయి’’ అని శ్రీధర్‌బాబు తెలిపారు.
ప్రభుత్వానికి కళ్లు, చెవులు ప్రభుత్వ అధికారులే
ప్రభుత్వానికి కళ్లు, చెవులు ప్రభుత్వ అధికారులే. డిసెంబర్‌ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో ప్రజాపాలన గ్రామ, వార్డు సభల నిర్వహణ చేపట్టాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కొండా సురేఖ అన్నారు. మంగళవారం ప్రజాపాలనపై ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రతి రోజు రెండు షిఫ్టులలో ప్రజాపాలన గ్రామసభల నిర్వహణ  చేపట్టాలని అధికారులను ఆదేశించారు.మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి. ప్రతి మండలంలో అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు తీసుకుకొని ప్రతి దరఖాస్తును స్వీకరించాలని పేర్కొన్నారు. ప్రతి దరఖాస్తు దారునికి 5 నిమిషాల నుంచి10 నిమిషాల సమయం కేటాయించాలి.ప్రజా పాలన కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైందని, అధికారులు బాధ్యతాయితంగా పని చేయాలన్నారు. దరఖాస్తు దారునికి రూపాయి ఖర్చు లేకుండా చూడాలన్నారు. అలాగే తగిన్నన్ని కౌంటర్లు, ఏర్పాటు చేసి రశీదు అందజేయాలన్నారు. అనంతరం ప్రతి దరకాస్తు వివరాలు కంప్యూటర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ జా, వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ షేక్‌ రిజ్వన్‌ బాషా, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఆరు గ్యారంటీలు అమలు
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఆరు గ్యారంటీలు అమలు చేయనున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో ప్రజా పాలనపై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులతో మంగళవారం మంత్రి సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన నిర్వహణ ప్రణాళిక పక్కగా రూపొందించాలని, అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని ఆదేశించారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని వెల్లడిరచారు. ఎంతో మంది తమ సమస్యలు, తమ కష్టాలు తీరుతాయని ఎంతో ఆశతో ఉన్నారని అన్నారు. ప్రజల సమస్యలను తీర్చి వారి ఆర్థిక ప్రగతికితోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించిందని తెలిపారు.అధికారులు మొక్కుబడిగా కాకుండా జవాబుదారీ తనంతో అత్యంత పారదర్శంకంగా పని చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను స్వీకరించి ఆ డాటాను డిజిటలైజ్‌ చేయాలని తెలిపారు. ఈ సవిూక్షలో రాజ్య సభ్యుడు కెఆర్‌ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌ రెడ్డి, భూపతి రెడ్డి, జడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు .