హరితహారంపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి

మరోమారు విత్తన బంతుల ప్రయోగం

జనగామ,జూన్‌30(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణకు హరితహారం కింద జనగామ జిల్లాలో ఆటవీ సంపదను 33 శాతాని పెంచాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది. జిల్లాల పునర్విభజన తర్వాత హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం జనగామ జిల్లాలో పెద్దఎత్తున మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే కలెక్టర్‌ చొరవతో హైవే వెంట ఇరువైపులా వివిధ రకాల మొక్కలు నాటించారు. ఒకవైపు నర్సిరీల ద్వారా పెంచుతున్న మొక్కలను వివిధ ప్రాంతాల్లో నాటుతూనే మరోపక్క ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైన సీడ్‌బాల్స్‌ జిల్లా వ్యాప్తంగా మైదాన ప్రాంతాల్లో చల్లేందుకు నిర్ణయించారు. జనగామ జిల్లా ఆవిర్భావం తర్వాత రెండో రికార్డును సొంతం చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఏటా కోటి మొక్కలు నాటి గ్రామాలకు పచ్చలహారం తొడిగేందుకు హరితహారంలో భాగంగా మొక్కలు పెంచాలనే నిర్ణయానికి సీడ్‌బాల్స్‌ తయారీకి శ్రీకారం చుట్టారు. కేవలం 1శాతం ఆటవీ సంపద కారణంగానే ఎగువ ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతం నమోదై జిల్లాలో ప్రతీ ఏటా కరువు, దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రభుత్వం గుర్తించింది. అడవులను 33 శాతానికి పెంచేందుకు మ¬ద్యమంలా మొక్కల పెంపకానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. దీంతో కరువు జిల్లాజనగామలో ప్రయోగించిన సీడ్‌బాల్స్‌ మొలకెత్తి హరితహారం ఆశలు చిగురిస్తున్నాయి. గుజరాత్‌ రాష్ట్రంలో విజయవంతమైన సీడ్‌బాల్స్‌ ప్రయోగం తెలంగాణలో ప్రధానంగా అడవుల శాతం అతితక్కువగా ఉండి వర్షాభావం నెలకొంటున్న జనగామ జిల్లాలో వినూత్న ప్రయోగం ఫలిస్తోంది. వేలాది మంది భాగస్వామ్యంతో కోటి 10 లక్షల విత్తన బంతులు తయారు చేశారు. తొలి విడత జూన్‌ 16న చంపక్‌హిల్స్‌పై ప్రభుత్వ భూములు, కంటూరు కందకాలు, ఖాళీ ప్రదేశాల్లో వేసిన విత్తన బంతులు ఇటీవల వర్షాలకు మొలకెత్తి జిల్లా యంత్రాంగం ఆశలకు ఊపిరిలూదాయి. విత్తన బంతులు విసిరే కార్యక్రమం విజయవంతం కావడంతో రెండో విడత బంతులు వేయడానికి అధికార యంత్రాంగం సన్నద్దమైంది. జిల్లాలో వ్యాప్తంగా వివిధ నర్సరీల్లో 98లక్షల మొక్కలను పెంచుతున్నారు. వీటికి తోడు జిల్లాలో మరో కోటి 10లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ముందుకు పోతుంది. ఇదిలావుంటే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారంలో జిల్లాలోనే కొడకండ్ల అగ్రస్థానంలో ఉందని అదే రీతిని కొనసాగించాలని డీఆర్‌డీవో పిడి అన్నారు. జిల్లాలో అటవీ సాంద్రత తక్కువగా ఉండంతో అటవీ సాంద్రతను పెంచాలని దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. జిల్లాలో ఒక్కశాతమే ఉన్న అడవిని 33శాతం పెంచాలని పట్టుదలతో ఉన్నారని అందులో మనం భాగస్వాములమై అడవి సంపదను పెంచి రాబోయేతరాలకు మనుగడను అందివ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఒక మొక్కకు రూ.32ఖర్చు పెడుతుందని, నాటిన మొక్క ఎండిపోతే ప్రజాధనం వృధా అవుతుందని ఆయన తెలిపారు. హరితహారంలో ఈజీఎస్‌ ద్వారా మొక్కలు నాటుతుండగా విత్తన బంతులద్వారా మరిన్ని వేయనున్నట్లు ఆయన తెలిపారు.కరవు నుంచి జిల్లా ప్రజలను గట్టెక్కించి భావి తరాలకు పాడిపంటలతో విలసిల్లే పచ్చటి జిల్లా అందించాలంటే అడవుల విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలన్నది ప్రభుత్వ సంకల్పం. భావి తరాలకు పచ్చటి వన సంపద అందించేందుకుఒక్కో గ్రామపంచాయతీలో 40 నుంచి 50 వేల చొప్పున ఒకేరోజు కోటి 10లక్షల విత్తన బంతులను తయారు చేశారు.