హరితహారం కోసం ఏర్పాట్లు పూర్తి

ఉమ్మడి జిల్లాలో కార్యాచరణ సిద్దం

ఖమ్మం,జూలై21(జ‌నం సాక్షి): హరితహారం నాలుగో విడతలో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పచ్చనిహారం విజయవంతంగా చేసేలా కార్యక్రమాలు రూపొందించారు. రెండు జిల్లాలోనూ స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా కార్యక్రామలను రూపొందించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కలెక్టర్‌ లోకేశ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. నాటిన మొక్కలను బతికించుకునేందుకు కృషి చేయాలన్నారు. వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల పరిధిలో హరితహారంలో స్థానిక ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీసులు, ప్రజాప్రతినిదులు పాల్గొనేలా చేస్తున్నారు.పచ్చని హారానికి జిల్లాలో అనూహ్య స్పందన లభిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఖమ్మంతో పాటు సత్తుపల్లి, పాలేరు, వైరా, మధిర, నియోజకవర్గాల్లో హరితహారం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. జిల్లా అధికారులు హరితహారాన్ని స్పీడప్‌ చేసేందుకు కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులను ప్రోత్సహిస్తున్నారు. ప్రతి రోజు నాటే మొక్కల వివరాల నివేదికను తయారు చేయాలన్నారు. హరితహారంలో పాల్గొనని అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ అన్నారు. పోలీస్‌ కమిషనర్‌ సైతం పోలీసులకు మొక్కలు నాటే విషయంపై టార్గెట్‌లు విధించారు. అటవీ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. డ్వామా, డీఆర్‌డీఏ, వ్యవసాయ, ఉద్యానవన శాఖ తదితర శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కొనసాగనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు పిలుపునిచ్చారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థీ విధిగా ఒక మొక్కను నాటాలని, తద్వారా ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు కలిసి మొక్కలు నాటాలని సూచిస్తున్నారు. ర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు భూమిపై నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు, వాతావరణ సమతుల్యతను సాధించే దిశగా విద్యార్థులతోపాటు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించి పెంచాలని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు పేర్కొన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసిమొక్కలు నాటాలన్నారు. పాఠశాలలు, వసతి గృహాల ప్రాంగణాల్లో పండ్ల మొక్కలను, సీ విటమిన్‌ ఫలాలను అందించే మొక్కలను పెంచాలని సూచించారు.