హర్షకుమార్‌కు షాక్‌!

– అమలాపురం ఎంపీ స్థానం ఆశించిన తెదేపాలో చేరిన హర్షకుమార్‌
– టికెట్‌ కేటాయించకుండా మొండిచేయిచూపిన బాబు
అమరావతి, మార్చి19(జ‌నంసాక్షి) : ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తర్వాత ఇప్పటికే 140 ఎమ్మెల్యే, 15 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ, మిగతా సీట్లను పెండింగ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడంతో మిగిలిన అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు చేసిన టీడీపీ సోమవారం అర్ధరాత్రి తర్వాత జాబితాను ప్రకటించింది. చివరి విడతలో 36 మంది ఎమ్మెల్యే స్థానాలు సహా ఎంపీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. తొలి జాబితాలో ఉండి సీటును వేటుకూరి వెంకట శివరామరాజుకు కేటాయించినా, చివరి నిమిషయంలో మార్పులు చేసింది. ఆయనను నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. లోక్‌సభ స్థానాలతో అసెంబ్లీ టిక్కెట్ల అంశం ముడిపడి ఉండటంతో మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. ఇక అమలాపురం పార్లమెంటు సీటు విషయంలో చివరివరకూ మాజీ ఎంపీ హర్షకుమార్‌ పేరు వినిపించింది. అయితే, ఈ స్థానం నుంచి దివంగత లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్‌ మాధుర్‌వైపే చంద్రబాబు మొగ్గుచూపారు. రాజంపేట నుంచి చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభను బరిలోకి దింపుతున్నారు. పది మంది సిట్టింగ్‌ ఎంపీలకు ఈసారి టిక్కెట్లు దక్కాయి. విశాఖ నుంచి బాలకృష్ణ అల్లుడు, ఎంవీవీఎస్‌ మూర్తి మనవడు శ్రీభరత్‌కే అవకాశం దక్కింది. రాజమండ్రి నుంచి మురళీమోహన్‌ కోడలు రూప, ఒంగోలు నుంచి శిద్ధా రాఘవరావు, నెల్లూరు నుంచి బీద మస్తాన్‌రావు, నంద్యాల నుంచి మాండ్ర శివానందరెడ్డిలకు సీట్లు ఖరారు చేశారు.  ఇదిలా ఉంటే హర్షకుమార్‌ అమలాపురం ఎంపీ స్థానాన్ని ఆశించిన చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. కానీ టికెట్‌ల కేటాయింపులో హర్షకుమార్‌ కుమార్‌ మొండిచేయి చూపడంతో ఆయన వర్గీయుల్లో ఆగ్రహం పెల్లుబికుతుంది. టికెట్‌ కేటాయిస్తామని చంద్రబాబు హావిూ ఇచ్చారని, కానీ చివరి నిమిషంలో మొండిచేయి చూపారంటూ హర్షకుమార్‌ వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.