హావిూలపై పెరుగుతున్న లెఫ్ట్‌ పార్టీల స్వరం

అమలు చేసి చూపాలన్న డిమాండ్‌
మరీ అంటకాగే చర్యలకు దూరంగా ఉండేయత్నాలు
హైదరాబాద్‌,ఆగస్ట్‌29 (జనం సాక్షి) మొన్నటి ఎన్నికల్లో హస్తానికి చేరువైన సిపిఐ, సిపిఎంలు ఇప్పుడు కొంత కటువుగానే ఉండాలని చూస్తున్నట్లుగా ఉంది. వివిధ అంశాల పై సమయానుకూలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. హావిూల అమలు నుంచి రుణమాఫీ దాకా? రుణమాఫీ నుంచి కవిత బెయిల్‌ దాకా.. కాంగ్రెస్‌ పార్టీతో విభేదిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇదంతా చూస్తూంటే కాంగ్రెస్‌ విషయంలో కొంత కటువుగానే ఉండాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో లెప్ట్‌ పార్టీలు,కాంగ్రెస్‌ మధ్య ఏదో జరుగుతోందన్న చర్చ ఇప్పుడు కీలకంగా మారంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో.. అంతా సవ్యంగానే నడిరచింది. అసెంబ్లీలో సీపీఐ సభ్యుడు కూనంనేని కూడా అధికారపక్షంతోనే ఆశీనులవుతూ.. అంశాలవారీగా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ఇటీవల రాఘవులు, జూలకంటి రంగారెడ్డి సహా పలువురు నేతలు సైతం సీఎం రేవంత్‌తో ములాఖత్‌ కావడంతో సీపీఎం కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా
ఉంటుందన్న సంకేతాలు ఇచ్చారు. అయితే కొన్నాళ్లుగా లెప్ట్‌పార్టీలకు, కాంగ్రెస్‌కు మధ్య ..కొంత గ్యాప్‌ ఏర్పడిరదని అనిపిస్తోంది. రుణమాఫీపై విపక్ష బిఆర్‌ఎస్‌, బిజెపిల విమర్శలకు తోడు ఇప్పుడు సిపిఐ కూడా స్వరం కలిపింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు అందరికీ రుణమాఫీ చేయాలని సిపిఐ కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో మాట కాకుండా అందరూ కలిసి ఒకే మాట చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే రుణమాఫీ విషయంలో బీఆర్‌ఎస్‌తో పోల్చితే కాంగ్రెస్‌ వెయ్యి పాళ్ళు నయమని అంటూనే కొంత నిరసన స్వరం వినిపించారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే సిపిఐ కూడా అధికార కాంగ్రెస్‌పై కొంత అసహనంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. రుణమాఫీ విషయంలో పట్టింపులు ఎందుకని కూనంనేని ప్రశ్నించారు. ఇచ్చినవి ఇచ్చామని.. ఇవ్వనివి లేదని చెప్పాలని పేర్కొన్నారు. రేషన్‌ కార్డుకు నిబంధన ఎందుకని ఆయన ప్రశ్నించారు. చిన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారని.. వారికి రుణమాఫీ చేయరా అని కూడా కూనంనేని నిలదీశారు. ఎన్నికల్లో హావిూ ఇచ్చినట్టు అందరికీ రుణమాఫీ చేయాలన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి పులివిూద స్వారీ చేస్తున్నారని అన్నారు. చెరువుల ఆక్రమణలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఐపీఎస్‌ రంగనాథ్‌ మంచి మనిషి అని… పనిలో స్పీడ్‌ ఉందని కూనంనేని కొనియాడారు. చెరువులు, శికం భూమిలో పర్మిషన్‌ ఇచ్చిన అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకోవా లని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ను రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అలాగే చెరువుల పునరుద్ధరణ చేపట్టాలని కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు అని స్పష్టం చేశారు. రుణమాఫీపై రైతులు ధర్నాలు చేస్తే తాము మద్దతు ఇస్తామని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయకపోయినా ఇప్పటి ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో హైడ్రా అనే పేరుతో జనాలను భయపడుతున్నారని.. హైడ్రా నుంచి సామాన్యులకు విముక్తి కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ఉనికి కోసం పోరాడుతుందని.. ఇక బీఆర్‌ఎస్‌ కోలుకోవడం కష్టం అని కూడా వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ వీడేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారని.. సమయం కోసం వేచిచూస్తున్నారని కూనంనేని సాంబశివరావు అన్నారు. మొత్తంగా ఈ వ్యాఖ్యలను బట్టి కూనంనేని కొంత కటువుగానే కాంగ్రెస్‌ను హెచ్చరిస్తున్నారని భావించాలి. ప్రధానంగా రుణమాఫీ విషయంలో ప్రభుత్వపెద్దలు చెబుతున్న వ్యాఖ్యలు ఒకలా ఉంటే.. మిత్రపక్షంగా వాటిని సమర్థించాల్సిన సీపీఐ.. మరోవిధంగా స్పందిస్తుండటం రాజకీయంగా ఏదో శకునాన్ని సూచిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రుణమాఫీ జరిగిపోయిందనీ రైతులకు ఇప్పటివరకు ఈస్థాయిలో మేలు చేసింది తమ ప్రభుత్వమేనని కాంగ్రెస్‌ పెద్దలు చెబుతున్నారు.
రుణమాఫీ అంశంలో.. ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌ యుద్ధం చేయడం కామన్‌. కానీ, మిత్రపక్షంగా ఉన్న సీపీఐ కూడా? అదే తరహా వ్యాఖ్యలు చేస్తుండటం ఆసక్తి రేపుతోంది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ పూర్తిచేసి తీరాల్సిందేనంటున్న ఎమ్మెల్యే కూనంనేని రైతులకు కండీషన్లు పెట్టడం కరెక్ట్‌ కాదంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్లకపోతే? ప్రభుత్వానికే నష్టమంటూ హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఖమ్మంలో మంత్రి తుమ్మలను సీపీఐ శ్రేణులు అడ్డుకోవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. మంత్రి తుమ్మల సర్దిచెప్పుకోవాల్సి వచ్చిందంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.