హిజ్బుల్‌ చీఫ్‌ సలాహుద్దీన్‌ కుమారుడు అరెస్టు

– అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ
– 2011 ఉగ్ర నిధుల కేసుకు సంబంధించి షకీల్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడి
శ్రీనగర్‌, ఆగస్టు30(జ‌నం సాక్షి) : అంతర్జాతీయ ఉగ్రవాది, హిజ్బుల్‌ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌ కుమారుడు సయ్యద్‌ షకీల్‌ యూసఫ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. 2011 ఉగ్ర నిధుల కేసుకు సంబంధించి షకీల్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. షకీల్‌ తన తండ్రి నుంచి డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయన్నారు. షకీల్‌ ప్రస్తుతం శ్రీనగర్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో లాబొరేటరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం ఎన్‌ఐఏ సిబ్బంది, పోలీసులు, సీఆర్పీఎఫ్‌ సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో భాగంగా శ్రీనగర్‌లోని రాంబాగ్‌ ప్రాంతంలో షకీల్‌ను అదుపులోకి తీసుకున్నారు. హవాలా ఛానళ్ల ద్వారా పాకిస్థాన్‌ ఉగ్రవాదుల నుంచి జమ్ముకశ్మీర్‌లోకి డబ్బు వస్తోందని గతంలో వార్తలు వచ్చాయి. ఆ డబ్బును జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు, అల్లర్ల కోసం వినియోగిస్తున్నట్లు తేలడంతో 2011 ఏప్రిల్‌లో ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ.. సలాహుద్దీన్‌, వేర్పాటువాది సయ్యద్‌ అలీ షా గిలానీ సహా 10 మంది వ్యక్తులతో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా షకీల్‌ను కూడా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. షకీల్‌ అమెరికాకు చెందిన ఓ కంపెనీ ద్వారా ఐజజ్‌ అహ్మద్‌ భట్‌ అనే వ్యక్తి నుంచి డబ్బు తీసుకున్నట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. భట్‌ కూడా ఈ కేసులో నిందితుడు కాగా.. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.
కాగా.. ఇదే కేసుకు సంబంధించి సలాహుద్దీన్‌ మరో కుమారుడు షాహిద్‌ యూసఫ్‌ను కూడా గతేడాది ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. షాహిద్‌ జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వంలో అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవాడు. షాహిద్‌ కూడా తన తండ్రి నుంచి డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో 2017 అక్టోబరులో అతడిని అరెస్టు చేశారు. దీంతో అతడిని విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. హిజ్బుల్‌ చీఫ్‌, యునైటెడ్‌ జిహాద్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ అయిన సలాహుద్దీన్‌ను అమెరికా విదేశాంగ శాఖ అంతర్జాతీయ ఉగ్రవాది జాబితాలో చేర్చింది.