హిమాచల్‌లో బిజెకి ఎదురుదెబ్బ

మూడు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి
క్లీన్‌ స్వీప్‌ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థులు
సిమ్లా,నవంబర్‌2జనంసాక్షి :   కమలం పార్టీకి హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నడూ లేనంత గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని మండి లోక్‌సభ స్థానంతోపాటు ఫతేపూర్‌ సిక్రీ, అర్కి, జుబ్బల్‌`కోత్‌కై అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. రాష్టాన్రికి ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్రసింగ్‌ భార్య ప్రతిభాసింగ్‌ కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలవగా, కార్గిల్‌ వార్‌ హీరో బ్రిగేడియర్‌ (రిటైర్డ్‌) కుశాల్‌ చంద్‌ ఠాకూర్‌ బీజేపీ నుంచి పోటీ చేశారు. వీరభద్రసింగ్‌ మరణం తర్వాత ఆ కుటుంబం నుంచి ఓ వ్యక్తి పోటీ చేయడం ఇదే తొలిసారి. ప్రతిభాసింగ్‌ తన సవిూప బీజేపీ అభ్యర్థి కుశాల్‌ చంద్‌పై 8,766 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ స్థానంతోపాటు మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్‌ విజయబావుటా ఎగురవేసింది. జుబ్బల్‌`కోట్‌కై స్థానం నుంచి రోహిత్‌ ఠాకూర్‌ దాదాపు 6 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, అర్కి అసెంబ్లీ స్థానం నుంచి సంజయ్‌ అవస్థి 3,277 ఓట్ల తేడాతో, ఫతేపూర్‌ సిక్రి నుంచి పోటీ చేసిన భవానీ సింగ్‌ 5,652 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగిన అన్ని చోట్లా బీజేపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జై రామ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. పార్టీ ఓటమికి ద్రవ్యోల్బణం సమస్యే కారణమని అన్నారు.